ఏపీ డీజీపీ పార్క్‌ భూమిని ఆక్రమించుకున్నారు | MLA Alla Ramakrishna Reddy files PIL in High Court Over AP DGP RP Thakur park land grab | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీ పార్క్‌ భూమిని ఆక్రమించుకున్నారు

Published Fri, Mar 1 2019 8:23 AM | Last Updated on Fri, Mar 1 2019 11:12 AM

MLA Alla Ramakrishna Reddy files PIL in High Court Over AP DGP RP Thakur park land grab - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌(ఆర్పీ ఠాకూర్‌) హైదరాబాద్, ప్రశాసన్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని, దాని ఆసరాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 

ఇందులో తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే ఆర్‌పీ ఠాకూర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. హైదరాబాద్‌ ప్రశాసన్‌నగర్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం నామమాత్రపు ధరకు ప్లాట్లు కేటాయించిందని రామకృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఆర్‌పీ ఠాకూర్‌ కూడా ప్లాట్‌ నంబర్‌ 149లో 502 చదరపు గజాల స్థలం పొందారన్నారు. 1996లో జీహెచ్‌ఎంసీ నుంచి జీ+1కి అనుమతి పొందారని, దానికి విరుద్ధంగా జీ+3 నిర్మించారని పేర్కొన్నారు. అయినా, ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్య తీసుకోలేదని తెలిపారు. 2008లో ఆ అక్రమ నిర్మాణాన్ని క్రమబద్దీకరించుకున్నారు.  

2017లో మరోసారి అక్రమ నిర్మాణాలు మొదలుపెట్టారు... 
2017లో మరోసారి అక్రమ నిర్మాణాలను చేపట్టారని, ఈసారి జీహెచ్‌ఎంసీ పార్కును ఆక్రమించి మరీ ఈ నిర్మాణాలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒకటి నుంచి మూడో అంతస్తుకు మెటల్‌ ఫ్రేమ్‌ సాయంతో ఓ బ్రిడ్జిగా నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. దీనిపై పొరుగునే ఉన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.గోయల్‌ ఫిర్యాదు చేశారని, సమాచార హక్కు చట్టం కింద కూడా సమాచారం తీసుకున్నారని, ఠాకూర్‌ చేపడుతున్న నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు చెప్పారన్నారు. ఠాకూర్‌ అక్రమ నిర్మాణాలపై ప్రశాసన్‌నగర్‌ హౌసింగ్‌ సొసైటీ కూడా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు వివరణ కోరినా ఠాకూర్‌ స్పందించలేదన్నారు. 

అధికారులను అడ్డుకున్నారు... 
పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్న విషయంపై కూడా గోయల్‌ ఫిర్యాదు చేశారని, దీనిపై వాస్తవాలను తేల్చేందుకు ఠాకూర్‌ ఇంటి వద్దకు జీహెచ్‌ఎంసీ అధికారులు వెళ్లగా, ఠాకూర్‌ మనుషులు ఆ అధికారులను అడ్డుకున్నారని తెలిపారు. ఆ తరువాత ఠాకూర్‌ దీనిపై సివిల్‌ కోర్టుకెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారని, ఆ తరువాత కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. ఈ పిటిషన్‌లో ఠాకూర్‌ ఎక్కడా కూడా తన హోదా గురించి ప్రస్తావించలేదని తెలిపారు. వాస్తవాలను దాచి పెట్టి ఆ పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. పార్కు స్థలాన్ని ఆక్రమించుకుని, అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిసినా కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు ఠాకూర్‌పై చర్యలు తీసుకోవడం లేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, ఠాకూర్‌ చేపడుతున్న నిర్మాణాలను కూల్చివేసేలా జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement