
సాక్షి, సిద్ధిపేట జిల్లా: చింతమడకలో జరిగే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆకాంక్షించారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతమడక నుంచే ఆరోగ్య సూచిక నాంది పడిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనతోనే గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజూ 500 మందికి ఆరోగ్య పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
త్వరలో రాష్ట్రమంతట ఆరోగ్య సూచికః
చింతమడకలో ప్రారంభమైన ఆరోగ్య సూచిక త్వరలో రాష్ట్రం మొత్తం జరుగుతుందని చెప్పారు. పసిపిల్లల నుండి వృద్ధుల వరుకు అందరికి అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాగానే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.40 ఏళ్లు దాటిన మహిళలు,పురుషులు, క్యాన్సర్,గుండె జబ్బు పరీక్షలు చేయించుకోవాలన్నారు. అత్యవసర సర్జరీలు ఉంటే సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో కంటి, పళ్లకు ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతు బంధు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆరోగ్య సూచిక సిద్దిపేట నియోజకవర్గం చింతమడక నుండే ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.