సాక్షిప్రతినిధి, నల్లగొండ : ‘నల్లగొండ–ఖమ్మం– వరంగల్ ’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్థానానికి 2013లో ఎన్నిక జరగగా, ఇక్కడినుంచి పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం (పీఆర్టీయూ) నుంచి పూల రవీందర్ విజయం సాధించారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈలోగానే ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం ఈ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు కలిసి ఉన్న ఈ నియోజకవర్గంలో 20,585 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.
వీరిలో పురుష ఓటర్లు 13,478, మహిళా ఓటర్లు 7,107 మంది ఉన్నారు. ఈ ఎన్నిక కోసం ఓటర్లుగా నమోదు చేసుకోవాలని గత ఏడాది అక్టోబరు1వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా, నవంబరు 6వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అప్పటికి కేవలం 18వేల పైచిలుకు దరఖాస్తులు మాత్రమే అందడంతో ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు గడువు పొడిగించారు. మంగళవారమే తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. మరోవైపు ఈ ఎన్నికల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 181 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 20,585 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెలఖారులోగా, లేదంటే మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు
గడిచిన నెల రోజులకుపైగానే ఎమ్మెల్సీ ఎన్నికపై ఉపాధ్యాయ సంఘాలు దృష్టి సారించాయి. ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు సైతం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న పీఆర్టీయూ ఈసారి తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది. 2013నాటి ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పీఆర్టీయూ తరఫున పూల రవీందర్ గెలిచారు.
ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈసారి కూడా యూనియన్‌నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటింప చేసుకుని, టీఆర్‌ఎస్ అధినాయకత్వం మద్దతును పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి యూటీఎఫ్ సిద్ధమవుతోంది. ఆ సంఘం తమ అభ్యర్ధిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డిని ప్రకటించింది. వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన రిటైర్డ్ డీఈఓ చంద్రమోహన్, జనగామకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్య స్వతంత్రంగా పోటీచేయనున్నారు. ఎస్టీయూ టీఎఫ్ నేతలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
పీఆర్టీయూలో గుంపుల లొల్లి !
రెండో సారి కూడా బరిలోకి దిగాలని భావిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు యూనియన్‌లో అంతర్గతంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు. ఆ యూనియన్‌లో జరుగుతున్న పరిణామాలు పూల రవీందర్‌కు అడ్డంకిగా మారుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన కోమటిరెడ్డి నర్సింహారెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆయన తన ప్రచారం కూడా మొదలు పెట్టారు. యూనియన్‌ను వీడిన ఆయన ఇదివరకే తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్)లో చేరారు. ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలిచారు.
ఫలితంగా జిల్లా ఓట్లలో కచ్చితంగా చీలిక వస్తుందన్న ఆందోళన పీఆర్టీయూ నేతల్లో లేకపోలేదు. సంఘంలో రాష్ట్రస్థాయి నాయకత్వంలో వచ్చిన అభిప్రాయ బేధాలు, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన సొంత జిల్లా వరంగల్‌లో కూడా ఓట్లు చీలే ముప్పు ఏర్పడింది. మరోవైపు ఈ సంఘం నుంచి అభ్యర్థిగా ఇంకా ఎవరి పేరు ఖరారు కాకపోవడం, ఒక వేళ సిట్టింగ్ ఎమ్మెల్సీకి పీఆర్టీయూ నాయకత్వం టికెట్ ఖరారు చేసినా.. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటించాల్సి ఉండడం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసారి టీచర్ ఎమ్మెల్సీ టికెట్‌కు పీఆర్టీయూలో పోటీ ఎక్కువగానే ఉందని, దీనికితోడు రెబల్స్ బెడద సంఘం ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment