వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఆదివారం పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు వారి వారి అంచనాల్లో నిమగ్నమయ్యారు.
సాక్షి ప్రతినిధి,నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఆదివారం పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు వారి వారి అంచనాల్లో నిమగ్నమయ్యారు. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 60 శాతం పోలింగ్ జరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 50శాతానికి అటూ ఇటుగా పోలింగ్ నమోదు అయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, కాంగ్రెస్, లెఫ్ట్ అభ్యర్థులు తమవంతు ఓట్లను సాధించుకుంటారనే చర్చ జరుగుతోంది.
శ్రీహరికి.. ఓటే లేదట!
హన్మకొండ: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ విషయంలో చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ సమయానికి తన ఓటు ఏ బూత్‌లో ఉందో చూసుకునే సరికి ఎక్కడా కనిపించలేదు. గత పట్టభద్రుల పోలింగ్‌లో కడియం ఓటేశారని, ఇప్పు డు ఎందుకులేదని కొందరు అధికారులను అడగడంతో వారు ముందు ఆందోళన పడ్డారు. ఎందుకైనా మంచి దని.. పాత ఓటర్ల జాబితా, ప్రస్తుత ఓటర్ల ముసాయిదా జాబితా అన్నింటిని పూర్తిగా పరిశీలించారు. వాటిలో కడియం ఓటు లేదు.