తిరుపతి కొర్లగుంట పోలింగ్ కేంద్రం వద్ద సీఐ చంద్రశేఖరన్‌ను దూషిస్తున్న టీడీపీ నేత ఉమాపతి
సాక్షి, తిరుపతి/ఒంగోలు/సాక్షి ప్రతినిధి నెల్లూరు: ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు అడ్డదారులు తొక్కారు. ఓటర్లను అడ్డుకుంటూ పోలింగ్‌ను తీవ్ర ఆలస్యం చేసేందుకు యత్నించారు. దొంగ ఓట్లంటూ రచ్చరచ్చ చేశారు. కొందరు టీడీపీ కార్యకర్తలు మద్యం సేవించి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. మహిళలను దుర్భాషలాడుతూ నానా హంగామా చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
నెల్లూరులో టీడీపీ నేతలు బీదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్.. ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, తిరుపతిలో టీడీపీ మూకలు దౌర్జన్యాలకు తెగబడ్డారు. వివరాలివీ.. తిరుపతి సత్యనారాయణపురంలోని 233, 234 పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యుటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తమ ఓటును వినియోగించుకునేందుకు వెళ్లారు. వీరినెలా అనుమతిస్తారంటూ టీడీపీ నేతలు పోలీసులు, ఎన్నికల నిర్వాహకులపై దౌర్జన్యానికి దిగారు. వారిద్దరు ఓటు వేయడానికి వెళ్లారని ఎంత చెబుతున్నా వినకుండా రచ్చచేయడంతో అరెస్టు చేయక తప్పలేదు.
మద్యం సేవించి రాళ్లు రువ్వి..
తిరుపతి బాలాజీ కాలనీ పరిధిలోని పోలింగ్ కేంద్రం వద్ద కూడా టీడీపీ శ్రేణులు రెచి్చపోయారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రచ్చచేసేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ ముగియడానికి గంట ముందు టీడీపీకి చెందిన గోవిందాచారి అనే కార్యకర్త మహిళలను దొంగ ఓటర్లంటూ దుర్భాషలాడటం ప్రారంభించారు. రాళ్లు రువ్వారు. టీడీపీకి వామపక్ష పార్టీ శ్రేణులు మద్దతు పలికాయి. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. పోలీసులు వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతలను అరెస్టుచేశారు. టీటీడీ పరిపాలన భవనం సమీపంలోని గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోనూ దాదాపు ఇదే పరిస్థితి సృష్టించారు.
గొడవకు కారణం అయిన టీడీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తున్న దామచర్ల
శ్రీకాళహస్తిలో..
ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడులో పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త దామోదర్‌రెడ్డిపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొజ్జల సు«దీర్‌రెడ్డి, అతని అనుచరులు దాడిచేశారు. నియోజకవర్గంలో బీసీలంతా వైఎస్సార్‌సీపీ బలపరచిన అభ్యర్థులకే ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశ్యంతోనే దామోదర్‌పై దాడిచేశారని ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో 39, 39ఏ, 39బీ పోలింగ్ బూత్‌లలోకి టీడీపీ నేతలు చొరబడ్డారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడికి తెగబడ్డారు.
పోలీసులపై దామచర్ల దౌర్జన్యం
ఒంగోలులో పోలీసులు అదుపులోకి తీసుకున్న టీడీపీ కార్యకర్త కాకర్ల ఈశ్వర్ అనే వ్యక్తిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పోలీస్‌స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకువెళ్లారు. స్థానిక సెయింట్ థెరిస్సా ఉన్నత పాఠశాల పోలింగ్‌బూత్‌కు సమీపంలో సోమవారం ఈశ్వర్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాడంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
చివరకు ఇరువర్గాలు భౌతికదాడులకు దిగుతుండడంతో పోలీసులు చెల్లాచెదురు చేశారు. ముందస్తు చర్యగా పోలీసులు ఈశ్వర్‌ను టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇది తెలుసుకున్న జనార్దన్ తన అనుచరులతో అక్కడకు వెళ్లి పోలీసులు ఎంతగా వారిస్తున్నా లెక్కచేయకుండా దౌర్జన్యంగా ఈశ్వర్‌ను బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మండిపడడంతో దామచర్లతోపాటు మరికొందరిపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
నెల్లూరులో సీఐపై టీడీపీ నేతల రుబాబు
తూర్పు రాయలసీమ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రామ్మూర్తినగర్ ప్రైమరీ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కలిసి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో ఓటేసిన రవిచంద్ర అక్కడే నిలబడి ఉన్నారు. ఇంతలో బాలాజీనగర్ సీఐ రాములు నాయక్ అక్కడకు చేరుకుని ఓటేశారు కదా వెళ్లిపోవాలని బీదాకు సూచించారు.
దీంతో ఆయన కొద్దిసేపు ఉండి వెళ్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉండకూడదని సీఐ మరోసారి చెప్పడంతో బీదా ఆయనతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న అబ్దుల్ అజీజ్ మరింతగా రెచ్చిపోయి.. ‘సార్ ఏమనుకుంటున్నావ్.. టచ్‌చేసి చూడు’.. అంటూ సీఐను తోశారు. అంతేకాక.. పోలింగ్ కేంద్రంలోనే సీఐపై చిందులు తొక్కుతూ నానా యాగీ చేశారు. మరోవైపు.. పోలింగ్ కేంద్రం వద్ద మొబైల్ కౌంటర్ ఏర్పాటుచేయలేదంటూ వారిరువురూ సీఐపై మండిపడ్డారు. నిజానికి.. గత పదిరోజులుగా కలెక్టర్ ఈ విషయంలో విస్తత ప్రచారం కల్పించారు. కానీ, టీడీపీ నేతలు మాత్రం అవేవీ పట్టించుకోకుండా పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment