ఎమ్మెల్సీలు చెరొకటి.. 29న పోలింగ్‌   | Polling for two MLC seats on 29th Jan 2024 | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీలు చెరొకటి.. 29న పోలింగ్‌

Published Fri, Jan 5 2024 3:52 AM | Last Updated on Fri, Jan 5 2024 3:52 AM

Polling for two MLC seats on 29th Jan 2024 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా స్థానాల్లో ఒకటి అధికార కాంగ్రెస్‌ పార్టీకి, మరో స్థానం బీఆర్‌ఎస్‌కు దక్కనుంది. రెండు స్థానాలకు రెండు పార్టీల తరఫున ఇద్దరు అభ్యర్థులే నామినేషన్‌ వేసే పక్షంలో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వాస్తవానికి వారి పదవీకాలం 2027 నవంబర్‌ 30 వరకు ఉంది. అయితే వారి రాజీనామా అనివార్యం కావడంతో మండలిలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.  

కాంగ్రెస్‌ టికెట్‌ మైనారిటీ వర్గానికేనా? 
ఈ రెండు స్థానాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆయా పార్టీల అగ్ర నాయకులు పలువురికి ఎమ్మెల్సీ హామీలిచ్చారు. ఇప్పుడు అదే వారికి తలనొప్పిగా మారనుంది. కాంగ్రెస్‌ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఒక్క మైనారిటీ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఆ వర్గానికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం కూడా మైనారిటీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే రాష్ట్రంలో పార్టీ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో తమ అసెంబ్లీ స్థానాలను త్యాగం చేసిన పలువురు నేతలు కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్న వారిలో ఇటీవల ఎన్నికల్లో ఓటమి చెందిన షబ్బీర్‌ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, అలీ మస్కతి, అద్దంకి దయాకర్, అందెశ్రీ, సంపత్, మధుయాష్కీ గౌడ్‌లు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఒకే స్థానం లభించే అవకాశమున్నందున సీపీఐకి కేటాయించే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.  

ఎవరి త్యాగానికి ఫలితం దక్కుతుందో? 
బీఆర్‌ఎస్‌ విషయానికొస్తే..అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ నుంచి తప్పించిన పలువురు నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని అధినేత కేసీఆర్‌ స్వయంగా హామీ ఇచ్చారు. స్టేషన్‌ఘనపూర్‌ స్థానాన్ని కడియం శ్రీహరి కోసం త్యాగం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, జనగాం స్థానాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోసం వదులుకున్న ముత్తిరెడ్డి యాదగిరి, నర్సాపూర్‌ స్థానాన్ని సునీతా లక్ష్మారెడ్డి కోసం త్యాగం చేసిన మదన్‌రెడ్డి, కామారెడ్డిలో పార్టీ అధినేత కేసీఆర్‌ కోసం త్యాగం చేసిన గంపా గోవర్దన్‌ ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే అధినేత ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. 119 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్‌ 65 (సీపీఐ 1 కలిపి), బీఆర్‌ఎస్‌ 39, బీజేపీ 8, ఎంఐఎం ఏడుగురు ఎమ్మెల్యేల బలం కలిగి ఉన్నాయి. 

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్‌ 
– షెడ్యూల్‌ విడుదల చేసిన ఎలక్షన్‌ కమిషన్‌ 
– ఈ నెల 11న వెలువడనున్న నోటిఫికేషన్‌  
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిల రాజీనామాతో శాసనమండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. 18న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా, 19న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement