కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల చేరికపై రాజకీయ వర్గాల్లో చర్చ
ఇప్పటికే టీపీసీసీ నేతలతో టచ్‌లో కొందరు ఎమ్మెల్సీలు!
శాసన మండలిలో బలం లేకపోవడంతో కాంగ్రెస్‌కూ వారి అవసరం
అయితే బేషరతుగా వస్తేనే చేర్చుకుంటామంటున్న ‘ముఖ్య’ నేత
చేరుదామా, వద్దా అనే ఊగిసలాటలో గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు
మండలి చైర్మన్ విషయంలో ఏం చేద్దామన్న దానిపై ఇరుపక్షాల్లోనూ అస్పష్టత
బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస నోటీసు ఇస్తారా, లేదా అన్నదీ డౌటే..
ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సైలెంట్‌గా సిద్ధమవుతున్న అధికార కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగాల్సిన నేపథ్యంలో.. శాసన మండలి వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. మండలిలో బీఆర్‌ఎస్‌కే మెజారిటీ ఉంది. అసెంబ్లీ ఆమోదించి, పంపిన బిల్లుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశమూ ఆ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతు న్నారని.. 11 మంది ఇప్పటికే టీపీసీసీ నేతలతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. కానీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి బేషరతుగా వస్తేనే చేర్చుకుంటామని ‘ముఖ్య’ నేత షరతు పెడుతున్నారని అంటున్నారు. దీనితో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, కాంగ్రెస్‌లోకి వెళ్దామా, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుదామా అన్న విషయంలో ఏమీ తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
మండలి బలం బీఆర్‌ఎస్‌దే
తెలంగాణ ఏర్పాటైన మొదట్లో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా, శాసన మండలిలో ఎక్కువ మంది కాంగ్రెస్ సభ్యులు ఉండేవారు. మండలిలో రెండేళ్లకోసారి కొన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతూ.. ఎమ్మెల్సీల పదవీకాలం కొనసాగుతూ ఉండటమే దీనికి కారణం. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మండలిలో బీఆర్‌ఎస్ బలం ఎక్కువగా ఉంది. బీఆర్‌ఎస్‌కు 26 మంది ఎమ్మెల్సీలు ఉండగా, కాంగ్రెస్‌కు ఆరుగురు, ఎంఐఎంకు ఇద్దరు, బీజేపీకి ఒకరు, ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనసభా సాంప్రదాయాల ప్రకారం అసెంబ్లీలో ఆమోదం పొందిన ప్రతి బిల్లు శాసనమండలికి వస్తుంది. దానిపై మండలి చర్చించి, ఆమోదం పొందాల్సి ఉంటుంది.
బిల్లును ఒకసారి తిప్పిపంపేందుకూ అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఇకముందు కీలక బిల్లులు మండలికి వచ్చినప్పుడు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్‌కు చాన్స్ ఉంటుంది. ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపే తీర్మానం విషయంలోనూ మండలిలో అధికార పార్టీకి ఇబ్బందులు ఏర్పడటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరమేననే చర్చ జరుగుతోంది. ఇందుకుతగ్గట్టుగానే.
గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన కాంట్రాక్టు బిల్లులు, జిల్లా రాజకీయాల్లో తమకు కావాల్సిన పదవులు, రాష్ట్రస్థాయిలో గుర్తింపు, ఇతర అవసరాల ప్రాతిపదికన 11 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లోకి వచ్చినట్టు గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కానీ పార్టీ అవసరం ఎలా ఉన్నా ముందే షరతులు పెడుతూ వచ్చే వారిని తీసుకునేది లేదని రాష్ట్ర కాంగ్రెస్ ‘ముఖ్య’ నేత చెప్తున్నారని అంటున్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌లోనే ఉండి ఎలాగొలా నెట్టుకురావాలా? అధికార పార్టీలోకి వెళ్లి ‘పనులు’ చక్కబెట్టుకోవాలా అన్నదానిపై కొందరు ఎమ్మెల్సీలు తర్జనభర్జన పడుతున్నట్టు చర్చ జరుగుతోంది.
మండలి చైర్మన్‌పై ఆసక్తికర చర్చ
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యవహారం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నల్లగొండ జిల్లా రాజకీయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కుమారుడు అమిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ లోక్‌సభ టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని.. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలకు ముందే అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని అంటున్నారు. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల్లో.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ అవిశ్వాస తీర్మానం పెడుతుందనే చర్చ కూడా మొదలైంది.
కానీ బీఆర్‌ఎస్ వర్గాలు ఈ విషయంలో గుంభనంగా ఉన్నాయి. సుఖేందర్‌రెడ్డి అధికారికంగా బీఆర్‌ఎస్‌లోనే ఉన్న నేపథ్యంలో ఏం చేసినా రాజకీయంగా ఇబ్బంది రాకుండా ఉండాలన్న ధోరణిలో గులాబీ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఉన్నట్టుండి మండలి చైర్మన్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ అవిశ్వాసం నోటీసు ఇస్తే ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో ఏం జరుగుతోందో అన్న అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment