పింఛన్లపై కేసీఆర్ తీరు సరికాదు
ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ధ్వజం
భోలక్‌పూర్: ‘మీ ఇంట్లో ఏకంగా నాలుగు పదవులుండవచ్చు కానీ, సామాన్య పేద ప్రజల ఇళ్లల్లో ఒక్కరికే పింఛన్ ఇస్తాంటారా..ఇది మీ దురంహకారానికి నిదర్శనం’ అని సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన సభ్యత్వ నమోదు కార్యక్రమం రాజాడీలక్స్ థీయేటర్ ఎదురుగా ముషీరాబాద్ ప్రధాన రోడ్డు పక్కన బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆరు నెలల పాలనలో ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో బతుకమ్మ ఆట తెలవని వారుండరు కానీ, మగ అధికారులతో బతుకమ్మలను ఆడించిన ఘనత కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత మంది ఇతర పార్టీల్లోకి వెళ్లినా నష్టంలేదన్నారు.
దానం నాగేందర్ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్, భోలక్‌పూర్ కార్పొరేటర్ వాజిద్‌హుస్సేన్, రాంనగర్ కార్పొరేటర్ కల్పనా, బాగ్‌లింగంపల్లి కార్పొరేటర్ ప్రభాకర్‌రెడ్డి, సెట్విన్ చైర్మన్ మక్సూద్, నాయకులు డాక్టర్.వినయ్,టి.రాజేశ్వర్, శ్రీనివాస్‌రెడ్డి, కేఆర్‌కె.ప్రసాద్, కేశవ్, అంజిరెడ్డి, పూస శ్రీకృష్ణ, ఎం.ఆర్.దశరథ్, ఐడీఎల్ సత్యనారాయణ, నగేష్ ముదిరాజ్, లక్ష్మీబాయి, సుభద్ర, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు