ఎంఎంటీఎస్ రెండో దశకు మోక్షం!
- పక్షం రోజుల్లో పనులు ప్రారంభం
- జీఎమ్మార్ రాకతో పురోగతి
- రూ.379 కోట్లతో డబ్లింగ్, విద్యుదీకరణ
- రూ.300 కోట్లతో కొత్త రైళ్లు, స్టేషన్ల నిర్మాణం
- 2016 నాటికి పట్టాల పైకి రైళ్లు
సాక్షి,సిటీబ్యూరో : సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పది రోజుల క్రితమే జీఎమ్మార్, కాళింది రైల్ నిర్మాణ్, టాటా ప్రాజెక్ట్స్ కన్సార్షియం ఈ ప్రాజెక్టును దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ రెండో దశ పనులపై దృష్టి కేంద్రీకరించింది. 15 రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
రెండో దశలో ప్రతిపాదించిన ఆరు లైన్లలో ఒకేసారి పనులు ప్రారంభమవుతాయని, వీలైనంత త్వరగా లైన్‌ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.379 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. మొత్తం 84 కిలోమీటర్లు వరకు లైన్ల నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేసి, 2016 చివరి నాటికి మరో రూ.300 కోట్లతో స్టేషన్‌ల నిర్మాణం, కొత్త రైళ్లు తెప్పించి పనులను పూర్తి చేస్తారు. రెండో దశ నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి దక్షిణమధ్య రైల్వేకు అందజేయాలని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది.