మో‘డల్’ స్కూళ్లు | model schools did not started | Sakshi
Sakshi News home page

మో‘డల్’ స్కూళ్లు

Published Sat, May 10 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

model schools did not started

 సాక్షి, మంచిర్యాల :  జిల్లాలోని 14 మండలాలకు 2012-13 విద్యాసంవత్సరానికి మొదటిదశలో మోడల్ స్కూళ్లు మంజూరయ్యాయి. అయితే ఏ ఒక్కచోట పాఠశాల  ప్రారంభం కాలేదు. 2013-14లో గదుల నిర్మాణం కాకపోయినప్పటికీ తాత్కాలికంగా తరగతులు ప్రారంభించారు. సమీపంలోని పాఠశాలల్లో తరగ తులను కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఏడు మండలాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. మిగతా ఏడు ఆదర్శ పాఠశాలల్లో ఈ ఏడాది కూడా ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియలో వీటికి భాగస్వామ్యం కల్పించలేదు.

 వసతి గృహాలేవి?
 తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చినప్పటికీ హాస్టళ్ల నిర్మాణం మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. గదులు లేకపోవడంతో గతేడాది ప్రవేశాలు కల్పించలేదు. మోడల్ స్కూల్ విధానంలో పాఠశాల, హాస్టల్ ఉండాలి. హాస్టల్‌లో కేవలం బాలికల కే వసతి ఉంటుంది. హాస్టల్ వసతి లేక పోవడంతో దూరప్రాంతాల వారు పాఠశాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు ఈ సమస్యతో డ్రాపౌట్లు పెరుగుతున్నాయి.  పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలను సాకుగా చూయించి రీ టెండర్ పిలిచేలా ఒత్తిడి తీసుకురావచ్చనే ఆలోచనతో కొందరు కాంట్రాక్టర్లు ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

 పూర్తికాని నియామకాలు
 ఆదర్శ పాఠశాల మొదటిదశ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో మొదటిదశలో భాగంగా 2013 జూన్‌లో పదిమంది పీజీటీలను తొలుత ఆయా పాఠశాలలకు నియమించారు. వేతన భద్రత లేకపోవడంతో ఐదు నుంచి ఆరుగురు మాత్రమే విధుల్లో చేరారు. తర్వాత 2013 నవంబర్‌లో స్కూలుకు ఆరుగురు టీజీటీల చొప్పున ఎంపిక చేయగా ముగ్గురు నుంచి నలుగురు చొప్పున విధుల్లో చేరారు. పాఠశాలకు 10 మంది పీజీటీలతో పాటు ఆరుగురు టీజీటీలు విధులు నిర్వర్తించాలి.

కంప్యూటర్ ఆపరేటర్, వాచ్‌మన్, పీఈటీ, ఆఫీస్ సబార్డినేట్‌లను ఆయా పాఠశాలలకు ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎంపిక చేశారు. వీరిని 2014 మార్చి మొదటివారంలో నియమించడంతో వీరి సేవలు పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదు. అంతేకాకుండా పీఈటీ, ఆఫీస్ సబార్డినేట్‌లను ఏప్రిల్ చివరివారంలో విధుల్లో నుంచి రిలీవ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్‌తో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వర్తిస్తూ వాచ్‌మన్‌తో ఆయాపాఠశాల భద్రతను కొనసాగిస్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఆదర్శ పాఠ శాలలోనూ యూనిఫాంల పంపిణీ జరగలేదు.

 ఉపాధ్యాయుల్లోనూ అభద్రత
 ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన యువ ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్ల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి సర్వీసు రూల్స్ రాలేదు. దీంతోపాటు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని, ఐఆర్ డీఏ చెల్లించాలనే డిమాండ్లు ఉన్నాయి. మూడు డిమాండ్ల సాధనకోసం ఆయావర్గాలు మొర పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించడంలేదు.

 పెరుగుతున్న విద్యాభారం!
 గతేడాది 6,7,8 తరగతులతోపాటు ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను ఆయా పాఠశాలల్లో నడిపించారు. ఈ ఏడాది తొమ్మిది, ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులను అదనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అడ్మిషన్ల ప్రక్రియ  కొనసాగుతోంది. గదులు లేకపోవడంతో క్లాసులు కొనసాగించడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది.

 భారీగా దరఖాస్తులు
 4మోడల్ స్కూళ్లలో సమస్యలు ఉన్నప్పటికీ అందిస్తున్న నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పెద్దఎత్తున దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేసి నాణ్యమైన విద్య బాలబాలికలకు అందేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement