సరికొత్త ‘షో’కులతో...
- ఆధునిక పరిజ్ఞానంతో లేజర్ షో
- నగర చరిత్ర, సంస్కృతులకు పెద్దపీట
- రూ.3.5 కోట్లతో ఆధునిక హంగులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ ప్రాంత చరిత్ర, సంస్కృతులను కళ్ల ముందుంచుతూ పర్యాటకుల మదిని దోచుకుంటున్న ‘లేజర్ షో’కు సరికొత్త అందాలు అద్దేందుకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది. లుంబినీ పార్కులో ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రదర్శిస్తున్న లేజర్ షో భాగ్యనగరానికేగాక మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు కూడా కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. దీన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ఉన్న థీమ్‌కు కొత్తగా మరో 2 థీమ్స్‌ను జత చేసేందుకు రూ.3.5 కోట్ల అంచనాలతో సోమవారం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. టర్న్‌కీ ప్రాతిపదికన అయిదేళ్ల పాటు నిర్వహణ, మరమ్మతులతో పాటు మల్టీమీడియా లేజర్ షో రూపకల్పన, సరఫరా, స్థాపన, ప్రదర్శన చేపట్టాలన్న నియమ, నిబంధనలను గ్లోబల్ టెండర్‌లో ప్రతిపాదించినట్లు చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అధునాతనమైన వివిధ థీమ్‌లను అధ్యయనం చేశాక వాటి నమూనాల ఆధారంగానే లుంబినీ లేజర్ షో థీమ్ పార్కుకు పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు. త్వరలో అద్భుత లేజర్ టెక్నాలజీని పర్యాటకులకు పరిచయం చేస్తామని చెప్పారు.
వైభవానికి చిహ్నంగా...
ప్రధానంగా తెలుగు సంస్కృతి, వైభవం, హైదరాబాద్ ప్రాంతంలోని చారిత్రక వైశిష్ట్యాన్ని ప్రతిబింబించేలా రెండు సరికొత్త థీమ్‌లతో లేజర్ షోను పరిపుష్ఠం చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో పాటు నగర ప్రజానీకాన్ని సంతృప్తిపరిచే విధంగా కొత్త థీమ్‌లను రూపకల్పన చేయాలన్నది అధికారుల యోచన.
చిన్నపిల్లలు, విద్యార్థులకు వినోదం, విజ్ఞానం పంచి ఇచ్చే కొత్త థీమ్‌లపై ఇప్పటికే కొంత అధ్యయనం చేసిన అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు హైదరాబాద్ ప్రాంత చరిత్ర, వారసత్వం, సంస్కృతిపై ఓ అవగాహన కల్పించేలా సరికొత్త థీమ్‌లను షోలో చేర్చాలని భావిస్తున్నారు. పర్యావరణం, పరిసరాల విజ్ఞానం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కొన్ని థీమ్‌లను చేర్చాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. కొత్త లేజర్ షో అందుబాటులోకి వచ్చే వరకు పర్యావరణ పరిరక్షణపై కొన్ని యానిమేషన్ చిత్రాలను ప్రదర్శించాలని యోచిస్తున్నారు.
మార్పులకు అనుగుణంగా...
లుంబినీ పార్కులో ప్రస్తుతం ప్రదర్శిస్తున్న లేజర్ షోలు ప్రధానంగా పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్‌డీ వి.కృష్ణ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇది కొత్తగానే ఉంటుందనే భావనతో ఎనిమిదేళ్లుగా ఒకే థీమ్‌ను కొనసాగిస్తూ వచ్చామన్నారు. ఇప్పుడు సాంకేతికంగా, వైజ్ఞానికంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా లేజర్ షోలకు కొత్త హంగులు సమకూర్చాలని కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రధానంగా లేజర్స్, పౌంటెన్స్, ఫౌంటెన్లస్రీన్స్ వంటి వాటిని అంతర్జాతీయ స్థాయిలోతీర్చిదిద్దుతామన్నారు. సాగర్ తీరంలోకి అడుగిడే పర్యాటకుల కోసం సరికొత్త అందాలను ఆవిష్కరించాలన్నదే హెచ్‌ఎండీఏ యోచన అని ఓఎస్‌డీ చెప్పారు.