మోదీపై దేశద్రోహం కేసు పెట్టాలి
వరంగల్ : దేశ ప్రధానమంత్రుల్లో ఎవరూ తిరగని దేశాలన్నీ ప్రధాని మోదీ తిరుగుతున్నారని, అక్కడ చేసే ప్రసంగాల్లో ఆయన దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు. బంధువుల శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం వరంగల్‌కు వచ్చిన ఆయన డీసీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్కాం ఇండియాను మేడిన్ ఇండియాగా మారుస్తున్నానని ఆయన అనడం దేశాన్ని కించపర్చినట్లేనన్నారు. ఇలాంటి ప్రసంగాలు చేస్తున్న మోదీ ప్రధానిగా పనికిరారని, అవసరమైతే ఆయనపై దేశ ద్రోహిగా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
దేశంలో, రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు వేసిన ప్రజలు... చేసిన తప్పుకు బాధ పడుతున్నారని, మంచి రోజులు.. ఇందిరమ్మ రోజులు దగ్గరల్లోనే ఉన్నాయన్నారు. యూపీఏ భాగస్వామ్య పార్టీలన్నీ 2004లో సోనియాను. 2009లో రాహూల్‌గాంధీని ప్రధానిని చేయాలని కోరినట్లు తెలిపారు. పదవీ కాంక్ష లేని మహోన్నత వ్యక్తులైనందునే మిస్టర్ క్లీన్‌గా పేరున్న మన్మోహన్‌ను సోనియా ప్రధాన మంత్రిని చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు ఆమెను అభినందించాయన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటి చేసేందుకు స్థానిక నాయకులు ఎందరో ఉన్నారని, అయినప్పటికి అదిష్టానం తప్పదు సర్వే... నీవు వెళ్లి పోటీ చేయాలని అంటే ఎన్నికల సంగ్రామంలో తాను సైనికుడిలా కరవాలం చేత పూని రంగంలోకి దిగుతానన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో క్షణికావేశంతో కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో కేసీఆర్‌కు ఓట్లు వేసినా భవిష్యత్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు.