sarve sathyanarayana
-
‘ఉత్తమ్‌ని తప్పిస్తేనే పార్టీ బతుకుతుంది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా మల్లు భట్టి విక్రమార్కను నియమించడంపై కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. భట్టికి సీఎల్పీ పదవి ఇవ్వడం మంచి నిర్ణయమని, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మరోసారి రుజువైందని అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఉంటే దళితుడు సీఎం అయ్యేవాడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలనీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కూమార్ రెడ్డి అసమర్థుడని విమర్శించారు. సీఎల్పీ కోసం ఉత్తమ్ పాకులాడారనీ, ఎన్నికల్లో ఓటమికి కారణమైన ఆయన వెంటనే రాజీనామా చేయాలని సర్వే డిమాండ్ చేశారు. ఉత్తమ్ నాయకత్వాన్ని నమ్ముకుంటే లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని, ఆయనను తప్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతుకుతుందని వ్యాఖ్యానించారు. -
'సోనియాగాంధీ ఆదేశంతోనే నామినేషన్ వేశా'
వరంగల్: మాజీ కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, మనమళ్ల సజీవ దహనం తనను ఎంతో కలిచివేసిందని వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయొద్దనుకున్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశం మేరకే తాను వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని సర్వే ధీమా వ్యక్తం చేశారు. -
మోదీపై దేశద్రోహం కేసు పెట్టాలి
వరంగల్ : దేశ ప్రధానమంత్రుల్లో ఎవరూ తిరగని దేశాలన్నీ ప్రధాని మోదీ తిరుగుతున్నారని, అక్కడ చేసే ప్రసంగాల్లో ఆయన దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు. బంధువుల శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం వరంగల్‌కు వచ్చిన ఆయన డీసీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్కాం ఇండియాను మేడిన్ ఇండియాగా మారుస్తున్నానని ఆయన అనడం దేశాన్ని కించపర్చినట్లేనన్నారు. ఇలాంటి ప్రసంగాలు చేస్తున్న మోదీ ప్రధానిగా పనికిరారని, అవసరమైతే ఆయనపై దేశ ద్రోహిగా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు వేసిన ప్రజలు... చేసిన తప్పుకు బాధ పడుతున్నారని, మంచి రోజులు.. ఇందిరమ్మ రోజులు దగ్గరల్లోనే ఉన్నాయన్నారు. యూపీఏ భాగస్వామ్య పార్టీలన్నీ 2004లో సోనియాను. 2009లో రాహూల్‌గాంధీని ప్రధానిని చేయాలని కోరినట్లు తెలిపారు. పదవీ కాంక్ష లేని మహోన్నత వ్యక్తులైనందునే మిస్టర్ క్లీన్‌గా పేరున్న మన్మోహన్‌ను సోనియా ప్రధాన మంత్రిని చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు ఆమెను అభినందించాయన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటి చేసేందుకు స్థానిక నాయకులు ఎందరో ఉన్నారని, అయినప్పటికి అదిష్టానం తప్పదు సర్వే... నీవు వెళ్లి పోటీ చేయాలని అంటే ఎన్నికల సంగ్రామంలో తాను సైనికుడిలా కరవాలం చేత పూని రంగంలోకి దిగుతానన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో క్షణికావేశంతో కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో కేసీఆర్‌కు ఓట్లు వేసినా భవిష్యత్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు.