రెక్కల కష్టం దక్కుతోంది | money deposit within 72 hours after grain sold | Sakshi
Sakshi News home page

రెక్కల కష్టం దక్కుతోంది

Published Mon, Nov 10 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

రెక్కల కష్టం దక్కుతోంది

రెక్కల కష్టం దక్కుతోంది

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎట్టకేలకు అన్నదాతల రెక్కల కష్టం నేరుగా వారింటికే వెళ్తోంది. దళారుల దగా.. దడవాయిల చేతివాటం లేకుండా ధాన్యం మీద వచ్చిన ప్రతి పైసా  నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతోంది. ‘సారూ... మక్కలమ్మిన పైసలు అప్పుడే బేంకిల బడ్డయట..నా బిడ్డ పోనుకు మిసేజి పెట్టిళ్లు.. హరీషన్నకు, జేసీసారుకు దండాలని జెప్పురి’ అని జోగిపేట రైతు మల్లయ్య ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి చెప్పారు.

ఆ తర్వాత ఎల్లారెడ్డి... వెంకట్‌రెడ్డి...నర్సింహులు.. యాదయ్య...ఇలా రైతులంతా తమ అకౌంట్‌లలో డబ్బు జమ కాగానే సాక్షి’కి ఫోన్ చేసి చెబుతున్నారు. ‘వీఐపీ రిపోర్టర్’పేరుతో నేరుగా జేసీనే తమ వద్దకు తీసుకువచ్చి తమ సమస్యల పరిష్కారానికి సాక్షి చూపిన చొరవను ప్రశంసిస్తున్నారు.

 జనం కష్టం తెలిసిన జేసీ
 ప్రజలతో కలిసిపోయి జనం కష్టాలను చూడటం జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్‌కు కొత్తకాదు. నిత్యం ప్రజలతో మమేకం కావటం వాటినికి అర్థవంతమైన  నివేదికలను రూపొందించి సర్కారుకు పంపడం, ప్రభుత్వాన్ని ఒప్పించడం వచ్చిన ఫలాలను ప్రజలకు అందించడం శరత్‌కు నిత్యకృత్యం.

కొత్తగా ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారిన ఆయన రైతుల వద్దకు వెళ్లి, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ఇచ్చిన హామీలను మంత్రి హరీష్‌రావు ద్వారా నెరవేర్చారు.  
 ఐకేపీ, మార్క్‌ఫెడ్ ద్వారా ధాన్యం అమ్మిన రైతులకు 72 గంటల్లో  రైతు బ్యాంకు అకౌంటులోనే డబ్బు జమ చేస్తామని హామీ ఇచ్చిన శరత్, ఆ మాట నిలబెట్టుకున్నారు.

 మాటనిలుపుకున్న మంత్రి హరీష్
 రైతులు ధాన్యం అమ్మిన 72 గంటల్లో ఆన్‌లైన్‌లోనే  రైతు అకౌంట్‌లోనే డబ్బు జమ చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హ రీష్‌రావు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే సభ్యులకు హామీ ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేయించాలని,  రైతులకు ఆన్‌లైన్ చెల్లింపుల విధానాన్ని మన జిల్లా నుంచే ప్రారంబిద్దామని అదే వేదిక మీద జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను ఆదేశించారు. దీంతో జేసీ శరత్ వెంటపడి టెక్నాలజీని అభివృద్ధి చేయించారు.

అంతేకాకుండా ఊరూరా తిరిగి రైతులు పండించిన ధాన్యం దళారులకు అమ్ముకోకుండా వారిలో చైతన్యం తీసుకువచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 70 కేంద్రాల ద్వారా ఐకేపీ, పీఏసీఎస్‌లు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 3,490 మంది రైతుల నుంచి 80,337 క్వింటాళ్ల మొక్క జొన్నలు కొనుగోలు చేశారు.

దాదాపు రూ. 2.5 కోట్లు రైతులకు అందాల్సి ఉంది. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ నేపథ్యంలో రైతుల ఇబ్బందులకు స్వయంగా చూసిన జేసీ శరత్, యుద్ధ ప్రాతిపదికన పంటకు వచ్చిన పైకాన్ని వారి ఖాతాలో జమ చేయిస్తున్నారు. రెండు రోజుల నుంచి దాదాపు 1,500 మంది రైతుల అకౌంట్లలో డబ్బు జమ అయ్యింది. మిగిలిన వారి అకౌంట్లలో కూడా ఒకటి రెండు రోజుల్లో డబ్బు జమ అయే అవకాశం ఉంది. ఇంటర్‌నెట్‌లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో చెల్లింపుల్లో స్వల్ప జాప్యం జరుగుతోందని, ఈ సమస్యను కూడా త్వరలోనే అధిగమిస్తామని అధికారులు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement