
కుషాయిగూడ (హైదరాబాద్): ఇకపై కరోనా రోగులకు నేరుగా చికిత్స అందించాల్సిన పనిలేదు. చికిత్స సమయంలో రోగులకు సమీపంలో ఉండి సేవలందిస్తున్న హెల్త్‌కేర్ సిబ్బందికి వైరస్ బా రిన పడతామనే ఆందోళన అవసరం లేదు. ఆసుపత్రిలో, ఐసోలేషన్‌లో ఉన్న రోగుల వద్దకు వెళ్లకుండానే రిమోట్‌తో వైద్యసేవలు అందించే పరికరం అందుబాటులోకి వచ్చింది.
నగరంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), రిషీకేశ్‌లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)తో కలిసి కరోనా రోగులకు రిమోట్‌తో వైద్యం అందించే పరికరాన్ని రూపొందించింది. దీనికి రిమోట్ హెల్త్ మా నిటరింగ్ సొల్యూషన్‌గా నామకరణం చేశారు. దీనిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్, ఎయిమ్స్ డైరెక్టర్ పద్మ శ్రీ ప్రొఫెసర్ రవికాంత్‌తో కలిసి ఎయిమ్స్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించి నట్లు ఈసీఐఎల్ సంస్థ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
చేతి గడియారం మాదిరిగా ఉన్న ఈ పరికరాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఐసోలేషన్‌లో ఉన్నవారిని 24 గంటల పాటుగా పర్యవేక్షించడానికి ఉపయోగపడటంతో పాటు, పీపీఈ కిట్ల డిమాండ్‌ను కూడా ఇది తగ్గించే అవకాశం ఉంది. ఈ అధునాతన పరికరం రోగి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ శాతం, హృదయ స్పందన, ఏ జోన్‌లో ఉన్నాడన్న అంశాలనూ తెలియజేస్తుంది. దీనిని రిషీ కే‹శ్ వైద్యులు కరోనా రోగులపై విజయవంతంగా పరీక్షిం చారు. ప్రస్తుతం వినియోగానికి సిద్ధంగా ఉందని చెప్పారు.