
నెలాఖరులోగా ‘వాటర్‌గ్రిడ్’ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. గ్రిడ్ పనుల కోసం వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులను వెంటనే పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వాటర్‌గ్రిడ్, పంచాయతీ రహదారుల నిర్మాణాలపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు.
మంత్రి మాట్లాడుతూ.. గ్రిడ్ కోసం నిర్మించబోతున్న ఇంటేక్ వెల్స్ అంచనాలు, డిజైన్లను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ .. తదితర విభాగాల అధికారులతో కలిపి రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని వారంలోగా నియమించాలని, నెలాఖరుకల్లా వాటర్‌గ్రిడ్ పైలాన్ నిర్మాణం పూర్తిచేసి, ఫిబ్రవరిలో ఆవిష్కరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.