విద్యార్ధులకు నైతికత నేర్పిద్దాం : కేసీఆర్‌ | Moral Curriculum in Schools From Next Year : KCR | Sakshi
Sakshi News home page

విద్యార్ధులకు నైతికత నేర్పిద్దాం : కేసీఆర్‌

Published Fri, Jan 3 2020 1:31 AM | Last Updated on Fri, Jan 3 2020 10:27 AM

Moral Curriculum in Schools From Next Year : KCR - Sakshi

మంచిని కాపాడటం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు కాదు.     – కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండా లని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిలషించారు. మంచి సమాజాన్ని నిర్మించే క్రమంలో జీయర్‌ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని ప్రకటించారు. మాజీ డీజీపీ హెచ్‌.జె. దొర ఆటోబయోగ్రఫీ ‘జర్నీ థ్రూ టర్బులెంట్‌ టైమ్స్‌’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. పుస్తక రచయితను, ప్రచురణకర్తలను సీఎం సన్మానించారు. దొరను మనసారా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, విజిలెన్స్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నందన్, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దొర గురువు ఆచార్య ఆర్వీఆర్‌ చంద్రశేఖర్‌రావు, ప్రముఖ పాత్రికేయులు ఐ.వెంకట్రావు, దొర స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే...

రాష్ట్రాన్ని ఆదర్శ సమాజంగా తీర్చిదిద్దాలి...
దురదృష్టవశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి పెరుగు తోంది. కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతు న్నారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించవచ్చు. దీనికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నాం. ఇందుకు అవసరమైన పాఠ్యాంశాలను తయారు చేయాలి. మాజీ డీజీపీలతో కమిటీ వేస్తాం. జీయర్‌ స్వామి లాంటి ఆధ్యాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటాం. మంచి సమాజం నిర్మించేందుకు అవసరమైన బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలి.

ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా ...
మంచిని కాపాడటం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు కాదు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదు.

సామాజిక రుగ్మతలపైనా పోలీసుల పోరు...
డీజీపీ మహేందర్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలను తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. కేవలం శాంతిభద్రతల పర్యవేక్షణకే పరిమతం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, బియ్యం అక్రమ రవాణా నిరోధం, హరితహారం ద్వారా మొక్కల పెంపకంలో ఎంతో కృషి చేశారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా పోలీసులు వారి వంతు పాత్ర పోషించాలి. ఈ సంవత్సరమే సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతోంది. అందులో పోలీసులు భాగస్వాములై విజయవంతం చేయాలి. చదువుకోని వారందరినీ అక్షరాస్యులగా మార్చే ప్రతిజ్ఞ తీసుకోవాలి.

ఇది మంచి పుస్తకం...
హెచ్‌జే దొర తన అనుభవాన్నంతా రంగరించి మంచి పుస్తకం రాశారు. టీమ్‌ వర్క్‌తో విజయాలు ఎలా సాధించవచ్చో, క్లిష్టమైన సమయాల్లో వ్యూహాత్మంగా ఎలా వ్యవహరించాలో, నేరాలను అదుపు చేయడంలో ఎలాంటి పద్ధతులు అవలంబించాలో, ఉన్న వనరులతో ఎంత సమర్థంగా పనిచేయవచ్చో దొర అనుభవం ద్వారా నేర్పారు. పుస్తకంలో కూడా అనేక విషయాలు చెప్పారు. వాటన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని పోలీసు అధికారులు ముందుకు సాగాలి. మానవ జీవితంలో మార్పులు అనివార్యం. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా మనం కూడా మారుతూ కార్యాలు నెరవేర్చాలి. సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి నిష్ణాతులను చేయాలి. వారిలో ప్రొఫెషనలిజం పెరగాలి. దీనికి అవసరమైన చర్యలు డీజీపీ తీసుకోవాలి. మనమెవరమూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. జీవించిన కాలంలో ఎంత గొప్పగా బతికాం, ఎంత ఆదర్శంగా నిలబడ్డాం అనేది ముఖ్యం. దొర అలాంటి వారిలో ఒకరు. గ్రేహౌండ్స్‌ను తీర్చిదిద్ది ఇప్పటికీ అందులో శిక్షణ ఇస్తున్న భాటి లాంటి వారు ఆదర్శప్రాయులు.

ప్రవీణ్‌ కుమార్‌కు సంపూర్ణ మద్దతు..
దేశంలో మనం ఏ ఊరికి వెళ్లి వెతికినా దళితులే పేదలుగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. దళితులు ఎదగాలి. తెలంగాణలో దళితులను విద్యావంతులను చేయడానికి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ఎంతో కష్టపడుతున్నారు. దళితులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనే ప్రవీణ్‌ సంకల్పానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. దళితుల్లో న్యూనతాభావాన్ని తీసేసి తాము గొప్ప పాఠశాలల్లో చదువుతున్నామనే భావన కల్పిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ప్రోత్సహించాలి.

పోలీసులు నిస్సహాయులు కాదు: దొర
పోలీసులు నిస్సహాయులనే భావనకు లోనుకావద్దని, ఉన్న వనరులను సమర్థంగా వాడుకోవాలని హెచ్‌జే దొర సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్నో ప్రజోపయోగ పనులు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ప్రజావైద్యం మెరుగుదల, చెరువుల పునరుద్ధరణ పనులు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సంపదగా మిగులుతాయన్నారు. భవిష్యత్తులో చాలా మంది మేటి విద్యార్ధులు తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నుంచి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఎంచుకున్న శాంతియుత పంథా వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తమిళనాడు మాజీ గవర్నర్‌ పీఎస్‌ రామ్మోహన్‌రావు పేర్కొన్నారు.

1969 ఉద్యమం హింసాత్మకం కావడం వల్లే విజయవంతం కాలేదన్నారు. తెలంగాణలో పోలీసు శాఖకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనివల్ల శాంతిభద్రతల పర్యవేక్షణ సులభమైందని చెప్పారు. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని, దేశంలో తెలంగాణ పోలీసలు అందుకున్న అవార్డులు ఎవరూ అందుకోలేదని మాజీ డీజీపీ రొడ్డం ప్రభాకర్‌రావు కితాబిచ్చారు. ప్రభుత్వం పోలీసు శాఖకు తగినన్ని నిధులు సమకూరుస్తూ పోలీసు శాఖను ఆధునీకరించిందని ప్రశంసించారు. సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావు మాట్లాడుతూ కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో తెలంగాణ పోలీసులు అద్భుత విజయాలు సాధించారన్నారు. పూర్వ అధికారుల నుంచి ఎంతో నేర్చుకోవడం ద్వారా ఇప్పుడు పనిచేస్తున్న పోలీసు అధికారులు పెను మార్పులు తీసుకురావడం సాధ్యమవుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement