
హేతుబద్ధంగా మూసివేతే..
రాష్ర్టంలో దాదాపు 4 వేల పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. పాఠశాలల హేతుబద్ధీకరణకు గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో జారీ చేసింది.
* హేతుబద్ధీకరణ జీవో సవరించకపోతే.. 4 వేల స్కూళ్లకు తాళాలు
* ఏప్రిల్ చివరలో ప్రక్రియ ప్రారంభం.. మే నెలాఖరుకు పూర్తి!
* మంత్రి హామీ ఇచ్చినా సవరణలకు నోచని జీవో
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో దాదాపు 4 వేల పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. పాఠశాలల హేతుబద్ధీకరణకు గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. విద్యార్థులు ఉన్న చోటుకు ఉపాధ్యాయులను పంపించేందుకు మాత్రమే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను చేపడతామని చెబుతున్నా.. పాఠశాలల హేతుబద్ధీకరణకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీంతో వెనక్కుతగ్గిన అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా స్కూళ్ల హేతుబ ద్ధీకరణ చేయబోమని, ఒక్క స్కూల్‌ను కూడా మూసివేయమని, ఉత్తర్వులకు సవరణ చేస్తామని అప్పట్లో ప్రకటించారు.
కానీ, ఇంతవరకు ఆ ఉత్తర్వుల సవరణకు అడుగు కూడా ముం దుకు పడలేదు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా పాఠశాలలను మూసివేయబోమని చెబుతున్నారు. కానీ, జీవో సవరణకు చర్యలు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. వచ్చే వేసవిలోనే (ఏప్రిల్ చివరలో హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టి మే చివరి నాటికి పూర్తి చేసే అవకాశం) ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. నేపథ్యంలో రేషనలైజేషన్ ఉత్తర్వులకు సవరణ చేయాలని సంఘాల నేతలు పట్టుబడుతున్నారు.
సెప్టెంబర్ 27న జారీ చేసిన జీవోలోని ముఖ్యాంశాలు..
* హేతుబద్ధీకరణలో భాగంగా ఉన్న పోస్టులను సర్దుబాటు మాత్రమే చేస్తారు. ఒక్క కొత్త పోస్టు కూడా సృష్టించరు. ప్రతి ఏటా పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్ ముగిసిన వెంటనే పాఠశాల విద్యా డెరైక్టర్ ఆదేశాల ప్రకారం హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలి.
* ప్రాథమిక పాఠశాలల్లో: 19, అంతకంటే తక్కువ విద్యార్థులుంటే వాటిని ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న మరో స్కూళ్లో విలీనం చేస్తారు. 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లను ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను ఇస్తారు. ఒకవేళ కిలోమీటరు పరిధిలో మరో పాఠశాల లేకపోతే కనీసం 15 మంది విద్యార్థులున్నా ఆ పాఠశాలను కొనసాగిస్తారు.
* ప్రాథమికోన్నత పాఠశాలల్లో: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల నిబంధనలే వర్తిస్తాయి. 6,7,8 తరగతుల్లో 19 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే, మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్న మరో ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయాలి.
* ఉన్నత పాఠశాలల్లో: 6 నుంచి పదో తరగతి వరకు 75 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలను మూసివేసి ఆ విద్యార్థులను సమీపంలోని మరో హైస్కూళ్లో నమోదు చేస్తారు.
బదలాయింపుపై ఉపాధ్యాయుల ఆందోళన..
ఒక స్కూల్లో నిర్ణీత సంఖ్యకంటే విద్యార్థులు తక్కువగా ఉంటే వారిని సమీపంలోని స్కూళ్లలో చేర్పిస్తారు. ఆ స్కూల్లోని టీచర్ పోస్టులను విద్యార్థులు ఉన్న మరో స్కూల్‌కు పంపిస్తారు. దీంతో ఆ స్కూల్ మామూలుగానే మూత పడుతుంది. అయితే ఆ స్కూల్లోని టీచర్ పోస్టుల బదలాయింపు విషయంలోనే ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. విలీనం చేసిన స్కూల్లోని టీచర్ పోస్టులను కూడా విద్యార్థులు ఉన్న చోటికి పంపిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ అవి రద్దు అవుతాయన్న ఆందోళనలో వారు ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం చాలా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఆయా స్కూళ్లలో మంజూరైన పోస్టులు ఉన్నాయి.
వాటిల్లో కొన్ని ఖాళీగా ఉండగా, మరికొన్నింటిలో టీచర్లు పని చేస్తున్నారు. ప్రస్తుతం స్కూళ్లలో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల మూసివేసే స్కూల్లోని టీచర్లను పక్క స్కూల్లోకి పంపించకుండా ఆ పోస్టులను రద్దు చేస్తారేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు విద్యా శాఖ నిబంధనల ప్రకారం ఒక స్కూల్‌ను మూసివేసినపుడు ఆ పోస్టులను మరో స్కూల్‌కు బదిలీ చేస్తారు. అయితే ఆ పోస్టులో టీచర్ ఉంటే పోస్టుతోపాటు అతడ్ని బదిలీ చేస్తారు. ఒకవేళ బదిలీపై మరో స్కూల్‌కు వెళ్లిన పోస్టులో టీచర్‌ను ఇవ్వకపోతే ఆ పోస్టు కూడా రద్దు అవుతుందన్న ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్నారు.