మెదక్, న్యూస్‌లైన్: కరెంట్ బిల్లులు.. వినియోగదారులను ‘షాక్’కు గురిచేస్తున్నాయి. ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) మీటరింగ్ విధానంతో నివాస గృహాలకు రూ. వేలల్లో బిల్లులు రావడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని రీడింగ్ తీయడం వల్లే రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే.. గతంలో వినియోగదారుల విజ్ఞప్తుల వల్ల మీటర్ రీడింగ్ తక్కువ వేశామని, ఇప్పుడు ఐఆర్ విధానంలో పాత యూనిట్లు బయటపడుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. కాగా ఒకేసారి ఎక్కువ యూనిట్లకు బిల్లులు చేయడంతో యూనిట్ రేట్లు చుక్కలన ంటాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పాపన్నపేట మండలం మిన్‌పూర్, ఎల్లాపూర్ గ్రామాల్లో మే నెలకు వచ్చిన కరెంట్ బిల్లులను చూసి వినియోగదారులు గుండెలు బాదుకుంటున్నారు. ఒక ఫ్యాన్, మూడు బల్బులున్న ఇళ్లకు కూడా రూ.వేలలో బిల్లు వస్తే.. గుడ్డి లాంతర్ల వెలుతురులోనే బతకడం నయమని వినియోగదారులు వాపోతున్నారు. మిన్‌పూర్ గ్రామానికి చెందిన చిన్నం మల్లయ్యకు రూ. 34,829, ఎల్లంపల్లి లింగమ్మకు రూ. 20,426, జంగం శంకరయ్యకు రూ.17,993, బోయిని పర్వయ్యకు రూ.10,072, బత్తిని పోచయ్యకు రూ.8,888, ఎ.నాగవ్వకు రూ.6,143, జంగం బాలకిష్టయ్యకు రూ.4,734, హన్మంతు గోపాల్‌కు రూ.4,186, ఎల్లంపల్లి లక్ష్మయ్యకు రూ.2,718, నాయికోటి బాగమ్మకు రూ.2,543, నాయికోటి వెంకమ్మకు రూ.1,273, ఎల్లాపూర్ గ్రామానికి చెందిన వెంకట్రావ్ ఇంటికి రూ.23 వేలు, పాపన్నపేటకు చెందిన బసి బాగయ్యకు రూ.15 వేలు, బాచారం బాలయ్యకు రూ.1,600 బిల్లులు వచ్చాయి.
ఆ బిల్లులను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సిబ్బంది తమ ఇళ్లకు రాకుండానే, మీటర్లు చూడకుండానే నె లనెలా రీడింగ్ నమోదు చేస్తున్నారని, అందువల్లే ఇలా కళ్లు బైర్లు కమ్మేలా బిల్లులు వచ్చాయని వినియోగదారులు వాపోతున్నారు. కాగా తాము నెల నెలా ఇళ్లకు వెళ్లి రీడింగ్ తీస్తున్నామని, వినియోగదారులు బతిమాలడం వల్లే కాస్తా రీడింగ్ అటు ఇటుగా వేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.
బిల్లుల మోతకు కారణమేంటి?
బిల్లింగ్ విధానంలో నూతనంగా ప్రవేశ పెట్టిన ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) మీటరింగ్ విధానం వల్లే రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ఐఆర్ మీటరింగ్ మిషన్లను మీటర్ ముందు ఉంచితే చాలు రీడింగ్ పూర్తిగా న మోదవుతుందని తెలుస్తోంది. అయితే గతంలో తక్కువగా వేసిన రీడింగ్ ఒకేసారి రావడం వల్లే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కాని ఒకేసారి ఎక్కువ యూనిట్లకు బిల్లు చేయడం వల్ల టారిఫ్ రేట్ మారి వినియోగదారుడు నిండా మునుగుతున్నాడు.
1 నుంచి 50 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.1.45పైసలు, 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.2.60 పైసలు, 101 నుంచి 200 యూనిట్ల వరకు 3,60పైసలు, 201 నుండి 250 యూనిట్ల వరకు రూ.6.38 ఇలా రేట్లు పెరుగుతుంటాయి. దీంతో ఒకేసారి ఎక్కువ యూనిట్లకు బిల్లు చేయడం వల్ల అధిక మొత్తంలో బిల్లులు వస్తున్నాయి. అందువల్ల ఒక సంవత్సర కాలానికి సంబంధించిన మొత్తం యూనిట్లను నెలవారి సరాసరిగా విభజించి బిల్లులు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. లేనిపక్షంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
కరెంట్ బిల్లు..బైర్లు కమ్ము!
Published Sat, May 24 2014 12:23 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement