సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలుగుదేశం పార్టీ తుది జాబితాపై మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిగాయి. రెండు పార్లమెంటు, మూడు అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిర్ధారించినా అధికారికంగా వారి పేర్లను వెలువరించలేదు. పొత్తులో భాగంగా జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించింది.
మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి సీఎంఆర్ విద్యాసంస్థల అధినేత చామకూర మల్లారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్‌కు పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ పేర్లను ఖరారు చేసినట్టు తెలిసింది. అలాగే మేడ్చల్ అసెంబ్లీ సెగ్మంట్‌కు తోటకూర జంగయ్యయాదవ్/నందారెడ్డి, శేరిలింగంపల్లి అరికపూడి గాంధీ, ఎల్‌బీనగర్‌కు ఆర్.కృష్ణయ్య, చేవెళ్లకు మేకల వెంకటేశం పేర్లను ఖరారు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎంపీ దేవేందర్‌గౌడ్‌లు అధ్యక్షుడు చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉప్పల్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్‌ను చేవెళ్ల పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఒప్పించారు. పొత్తులో భాగంగా ఉప్పల్ సెగ్మెంట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో వీరేందర్‌ను చేవెళ్ల ఎంపీ టికెట్ సర్దుబాటు చేశారు. కాగా కుత్బుల్లాపూర్ విషయంలో నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్న పార్టీ నేతలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
మల్కాజిగిరి సీఎంఆర్‌కు..
మల్కాజిగిరి పార్లమెంటు స్థానం తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పార్టీ నేతలు పలువురు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో సీటుపై ఆసక్తి పెరిగింది. పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెబెల్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవడం దీనికి మరింత ఆజ్యం పోసింది. టీడీపీ అగ్రనేతలు సీఎం రమేష్, సుజనా చౌదరి తదితరులు రేవంత్‌తో భేటీ అయి బుజ్జగించే యత్నం చేశారు. అయితే చివరికి పార్లమెంటు స్థానాన్ని సీఎంఆర్ విద్యాసంస్థలు అధినేత మల్లారెడ్డి పేరును పార్టీ ఖరారు చేసినట్టు సమాచారం.
మరికొన్ని స్థానాలకు టీడీపీ అభ్యర్థులు
Published Wed, Apr 9 2014 12:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement