సాక్షి ప్రతినిధి, ఏలూరు : జనంలో ఆదరణ లేదని తేలిపోవడంతో డీలాపడిన టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఆఖరి అస్త్రంగా నోట్లతో ఓట్ల వేట మొదలుపెట్టాయి. డబ్బును విచ్చలవిడిగా వెదజల్లడం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీల నేతలు రెండురోజుల నుంచి శతవి ధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకూ జనం మధ్యకు పూర్తిగా వెళ్లలేకపోయి నరసాపురంలోక్‌సభ బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు పూర్తిగా నోట్ల రాజకీయంపైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన యథేచ్ఛగా డబ్బును విరజిమ్ముతున్నారు. భీమవరం, ఉండి నియోజకవర్గాలపై మరింత దృష్టి కేంద్రీకరించిన ఆయన అక్కడి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. భీమవరంలో ఓటుకు రూ.వెయ్యికి పైగా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
ఉండిలోనూ అంతే మొత్తాన్ని ఇష్టానుసారం పంచిపెట్టిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఓటుకు రూ.700 వరకూ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంపై ఆశలు వది లేసుకున్న గంగరాజు చివరి ప్రయత్నంగా ధన ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. రూ.50 కోట్ల మొత్తాన్ని ఇందుకు వినియోగిస్తున్నట్లు సమాచారం. సహకార చక్కెర కర్మాగారాలు, ఇతర పరిశ్రమలను అప్పనంగా దక్కించుకుని అడ్డగోలుగా డబ్బు సంపాదించిన ఆయన ఆ డబ్బులో కొంత భాగాన్ని ఈ ఎన్నికల్లో బయటకు తీస్తున్నారు. సంఘ్ పరివార్ ముసుగులో క్రమశిక్షణ, నిజాయితీ గురించి చెప్పే ఆయన చివరకు ఎన్నికల్లో ఈ స్థాయికి దిగజారడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ అభ్యర్థులదీ అదేదారి
భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీ అభ్యర్థులు పులపర్తి రామాం జనేయులు, కలవపూడి శివ బీజేపీ అభ్యర్థి గంగరాజుతో కలసి భారీగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా జనానికి ఏమీ చేయకపోవడంతో వారిద్దరిపైనా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని చల్లార్చేందుకు వారు డబ్బును వినియోగిస్తున్నారు. నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ ఆశలు వదిలేసుకున్న టీడీపీ డబ్బుతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతోంది. భారీగా డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. తనకు ఎదురులేదని కొద్దిరోజుల క్రితం వరకూ విర్రవీగిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సైతం తనపై ప్రజల్లో ఉబికివస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు వెనకేసిన నల్లడబ్బును బయటకు తీసినట్లు తెలిసింది.
తణుకు టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఓటర్లందరినీ కొనేస్తానని.. ఒక్కొక్కరికీ రూ.1,500 ఇస్తానని చెబుతున్నట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలోనూ బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు డబ్బునే నమ్ముకుని ముందుకెళుతున్నారు. నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు డబ్బుతోపాటు రకరకాలుగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సోదరుని విద్యా సంస్థల సిబ్బంది డబ్బు పంపిణీ, తాయిలాల ఎరవేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ధనాన్నే నమ్ముకున్నారు. ఏలూరులో బడేటి బుజ్జి ఇప్పటికే డ్వాక్రా గ్రూపులకు గాలం వేసేందుకు ప్రయత్నించారు. దెందులూరు తాజా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామాలకు డబ్బు మూటలను తరలించి పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు నల్లధనంతోపాటు అధిష్టానం నుంచి వచ్చిన సొమ్ములను భారీగా పంచుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి అధిష్టానం కొంత డబ్బు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
భారీగా మద్యం పంపిణీ
డబ్బుతోపాటు మద్యాన్ని కూడా టీడీపీ నేతలు ఇష్టానుసారం పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గాల్లో రహస్యంగా దాచిన మద్యం నిల్వలను బయటకు తెచ్చి ఏరులై పారిస్తున్నారు. ఓటర్లు తమవైపు లేరనే విషయం తేలిపోడంతో ఆ పార్టీ డబ్బు, మద్యం, కానుకలతో ప్రలోభాలకు గురిచేసేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది. మంగళవారం మరింత విస్తృతంగా డబ్బును పంచేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నేరుగా ఆయా నియోజకవర్గాల నేతలతో మాట్లాడుతూ డబ్బు పంపిణీ, ఓటర్లను ఎలా లొంగదీసుకోవాలనే దానిపై సూచనలు ఇస్తున్నారు.
గంగరాజుకు బెంగ
Published Tue, May 6 2014 12:51 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement