శిశువును గుర్తించిన పోలీసులు, బాలింత మంజుల
గాంధీఆస్పత్రి: పండంటి మగశిశువుకు జన్మనిచ్చిన ఆ తల్లికి చివరికి ఆ కన్నపేగే భారమైంది. శిశువును వదిలేసి వెళ్లిపోయిన తల్లిని గుర్తించిన వైద్య సిబ్బంది, పోలీసులు శిశువుతోపాటు తల్లిని సంరక్షణ కేంద్రానికి తరలించిన ఘటన గాంధీ ఆస్పత్రిలో జరిగింది. వివరాలు.. కామారెడ్డికి చెందిన మంజుల, రమేష్ దంపతులు. గర్భవతి అయిన మంజుల కాన్పు కోసం ఈ నెల 22న గాంధీఆస్పత్రి గైనకాలజీ విభాగంలో చేరింది. 25న పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడం, వెంట ఉన్నవారు సరిగా పట్టించుకోకపోవడంతో పుట్టిన శిశువును బుధవారం రాత్రి ఆస్పత్రి ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వదిలేసి వెళ్లిపోయింది.
గుక్కపట్టి ఏడుస్తున్న శిశువును సెక్యూరిటీ సిబ్బంది గమనించి అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. శిశువు చేతికి ఉన్న ట్యాగ్ ఆధారంగా వివరాలు తెలుసుకున్న ఆస్పత్రి పాలన యంత్రాంగం సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి శిశువు తల్లి ఫొటోలను పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కామారెడ్డికి వెళ్లే అన్ని దారులను పరిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కామారెడ్డికి వెళ్లేందుకు వేచిచూస్తున్న శిశువు తల్లి మంజులను గుర్తించారు. శిశువుకు ఉన్న ట్యాగు, బాలింత మంజులకు ఉన్న ట్యాగు సరిపోవడంతో ఆమెకు నచ్చజెప్పి గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాలింత మంజులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శిశువుతోపాటు బాలింతను అమీర్‌పేట మైత్రివనం సమీపంలోని శిశువిహార్‌కు తరలించినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment