సాక్షి, ఆలేరు: టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు.
తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మోత్కుపల్లి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.
చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక ఇటీవల టీడీపీ నుంచి మోత్కుపల్లి బయటకు వచ్చారు. పలు సందర్భాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చంద్రబాబు మోసకారి, దుర్మార్గుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దొంగతనాలను బయటపెడతాననే తనపై కక్ష కట్టారని, తనకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment