నేడు ఎంపీపీ ఎన్నికలు | MPP elections today | Sakshi
Sakshi News home page

నేడు ఎంపీపీ ఎన్నికలు

Published Fri, Jul 4 2014 4:00 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM

MPP elections today

  •     49 మండలాల్లో ఏర్పాట్లు పూర్తి
  •      మంగపేటలో ఎన్నిక వాయిదా
  •      టీఆర్‌ఎస్‌కే ఆధిక్యత వచ్చే వకాశం
  •      కాంగ్రెస్‌కు 18 చోట్ల మెజారిటీ..
  •      అయినా ఆ పార్టీకి ఎంపీపీ పీఠం దక్కడంపై అనుమానాలు
  •      హంగ్ నెలకొన్న 14 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీలు
  • సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎన్నికల ఫలితాలు వచ్చిన 40 రోజుల తర్వాత మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 50 ఎంపీపీ స్థానాలుండగా... మంగపేట మినహా మిగిలిన అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ ఎంపీటీసీ  స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. లోకల్ పోరు కావడంతో స్థానిక అభ్యర్థుల బలంపైనే పార్టీలకు అధిక స్థానాలు వచ్చాయి.

    జిల్లావ్యాప్తంగా 705 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... కాంగ్రెస్‌కు 294, టీఆర్‌ఎస్‌కు 225, టీడీపీకి 128, బీజెపీ 12 స్థానాలు దక్కాయి. స్వతంత్రులు 46 స్థానాల్లో గెలుపొందారు. ఈ ఫలితాల రోజు సరళిని బట్టి కాంగ్రెస్‌కు 18, టీఆర్‌ఎస్ 14, న్యూడెమొక్రసీ ఒక ఎంపీపీ పదవిని కైవసం చేసుకునే పరిస్థితి నెలకొంది. అరుుతే... మారిన రాజకీయ సమీకరణలు.. పొత్తులు ఈ ఎన్నికలపై ప్రభావం చూపనున్నారుు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఎంపీటీసీ స్థానాలున్న మంగపేట మండల పరిషత్ ఎన్నిక కోర్టు ఆదేశాలతో వాయిదా పడింది.
     
    టీఆర్‌ఎస్ ముమ్మర యత్నాలు
     
    సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి మారింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో క్యాంపుల నిర్వహణ జోరందుకుంది. అధికారంలో ఉన్న పార్టీగా జిల్లాలోని మెజారిటీ ఎంపీపీ పదవులను కైవసం చేసుకునేందుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. విజయం సాధించిన స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థులను తమ వైపునకు తిప్పకునేందుకు టీఆర్‌ఎస్ అన్ని రకాలుగా యత్నించింది. జిల్లాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడంతో ఎంపీపీ ఎన్నికలు వారికి ప్రతిష్టాత్మకంగా మారాయి.

    మెజారిటీ ఎంపీపీ పదవులు టీఆర్‌ఎస్‌కు దక్కాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టీఆర్‌ఎస్‌కు మెజారిటీ తక్కువగా ఉన్న మండలాల్లో ప్రత్యర్థి పార్టీల ఎంపీటీసీలకు వల వేస్తున్నారు. అధికార పార్టీగా అభివృద్ధి పనులు, వ్యక్తిగతంగా సహకరిస్తామని హామీలు ఇస్తున్నారు. ఏ మాత్రం మెజారిటీ లేని కొన్ని మండలాల్లోనూ ప్రత్యర్థి శిబిరాన్ని మొత్తంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
     
    14 మండలాలపైనే అందరి దృష్టి
     
    జిల్లాలోని 14 మండలాల్లో ఎంపీపీని కైవసం చేసుకునే విషయంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. స్వతంత్రులు, టీడీపీ, సీపీఐ పార్టీల నుంచి గెలిచిన ఎంపీటీసీ సభ్యులకు డిమాండ్ పెరిగింది. కొంతమందిని బలవంతంగానైనా క్యాంపులకు తరలించారు. మరికొంత మంది క్యాంపులకు వెళ్లకుండానే... మంతనాలు జరుపుతున్నారు. ఎంపీపీ పీఠం కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంపీటీసీ సభ్యులకు  ఇరుపార్టీల నేతలు తాయిలాలు సైతం ప్రకటిస్తున్నారు. టీడీపీ, బీజేపీ నుంచి గెలిచిన వారిని తమతో కలుపుకునేందుకు పోటీ పడుతున్నారు.

    అవసరమైతే వైస్ చైర్మన్ పదవిని అప్పగించేందుకు ఆశ చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టీపీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ మండలంలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ 11 ఎంపీటీసీ స్థానాలుంటే కాంగ్రెస్-5, టీఆర్‌ఎస్-3, స్వతంత్రులు-2, టీడీపీ ఒక్క స్థానంలో గెలిచింది. ఇందులో ఇద్దరు స్వతంత్రులు టీఆర్‌ఎస్‌లో చేరగా ఆ పార్టీ బలం ఐదుకు చేరుకుంది. దీంతో నువ్వా.. నేనా.. అన్నట్లు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు సాగుతోంది. ఇక్కడ టీడీపీ సభ్యుడి మద్దతు కీలకం కానుంది.

    ఇక.. పాలకుర్తి, కేసముద్రం, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపురం, నల్లబెల్లి, మొగుళ్లపల్లి, గీసుగొండ, పరకాల, రేగొండ, ఆత్మకూరు, జఫర్‌గఢ్, లింగాలఘణపురం మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. హన్మకొండ, రాయపర్తి మండలాల్లో విలక్షణ పరిస్థితి నెలకొంది. హన్మకొండ మండల పరిధిలో రెండు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. వీరిలో ఒకరు అధ్యక్షుడిగా, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. కొత్తగూడ ఎంపీపీ పీఠం న్యూడెమోక్రసీ కైవసం కానుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement