సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పరిధి తగ్గింది. జిల్లాల పునర్విభజనతో జెడ్పీటీసీల సంఖ్యతోపాటు.. మండల ప్రాదేశిక స్థానాల సంఖ్యకు కూడా కోత పడింది. చాలా గ్రామాలు పురపాలనలో విలీనం కావడంతో ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో జెడ్పీటీసీల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 33 జిల్లా ప్రాదేశిక స్థానాలుండగా తాజాగా కేవలం రంగారెడ్డి జిల్లా వరకే చూస్తే ఈ సంఖ్య 21 పరిమితమైంది.
ఎంపీటీసీల విషయానికి వస్తే.. పాత జిల్లాలో 753 ఉండగా ప్రస్తుతం మన జిల్లాలో 258 ఎంపీటీసీలు మిగిలాయి. ఒక్క కొత్త రంగారెడ్డి జిల్లాలోనే 116 ఎంపీటీసీలకు కత్తెర పడింది. రాజేంద్రనగర్, సరూర్‌నగర్ గ్రామీణ మండలాలు సంపూర్ణంగా పురపాలనలో విలీనం కావడంతో పాటు శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయంజాల్, శంకర్‌పల్లిలు మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. వీటిలో పరిసర గ్రామాలు కలవడంతో మండల ప్రాదేశిక స్థానాలు కనుమరుగయ్యాయి. అదే సమయంలో పాలమూరు జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన ఆమనగల్లు కూడా పురపాలికగా మారడంతో సమీపంలోని కొన్ని గ్రామాల ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి.
ముసాయిదా రెడీ
ప్రస్తుత జెడ్పీ పాలకవర్గ కాలపరిమితి జులై మొదటి వారంలో ముగియనుండగా.. ఆ లోగా నూతన జిల్లాల ప్రాతిపదికన మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కసరత్తు చేసిన పంచాయతీరాజ్ విభాగం కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను సిద్ధం చేసింది. శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, బాలాపూర్, హయత్‌నగర్, గండిపేట మండలాలు పట్టణ ప్రాంత ప్రాంతాలు కావడంతో వీటిని పంచాయతీరాజ్ విభాగం నుంచి తొలగించారు.
ఇలా సరూర్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల్లో 71 ఎంపీటీసీ స్థానాలు కనుమరుగు అయ్యాయి. ఇక కొన్ని గ్రామాలు నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఆమనగల్లు, శంకర్‌పల్లి, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో పదుల సంఖ్యలో ఎంపీటీసీలు కలిసిపోయాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో మహబూబ్‌నగర్ నుంచి జిల్లాలో కొన్ని ప్రాంతాలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా కడ్తాల్, చౌదిరిగూడ, నందిగామ మండలాలుగా అవతరించాయి. ఈ మండలాల్లో నూతనంగా 28 ఎంపీటీసీ స్థానాలు తోడయ్యాయి. అలాగే ఫరూఖ్‌నగర్‌లో అదనంగా ఒక స్థానం పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముసాయిదా జాబితా ప్రకారం కొత్త రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 258కి తగ్గింది.
21 జెడ్పీటీసీ స్థానాలు
ఎంపీటీసీ స్థానాల సంఖ్య కుదింపుకాగా జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి పెరిగింది. ప్రస్తుతం కొత్త జిల్లా ప్రకారం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ముసాయిదా జాబితాను అనుసరించి ఈ సంఖ్య 21కు చేరుకుంది. పట్టణీకరణ కారణంగా సరూర్‌నగర్, రాజేంద్రనగర్ స్థానాలు గల్లంతుకాగా.. కడ్తాల్, నందిగామ, చౌదరిగూడ జెడ్పీటీసీ స్థానాలుగా అవతరించనున్నాయి.
3,500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం
కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ మండలాల ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రతి 3,500 జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్ధిష్ట జనాభా ఒక పంచాయతీలోనే ఉంటే.. ఆ గ్రామాన్ని ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో రెండు మూడు గ్రామాలను కలిపి ఒక ఎంపీటీసీ స్థానంగా విభజించారు. వీటిలో అధిక జనాభా ఉన్న గ్రామం పేరిటే ఎంపీటీసీ స్థానంగా నిర్ణయిస్తారు.
25న తుది జాబితా
258 ఎంపీటీసీ, 21జెడ్పీటీసీ స్థానాలతో కూడిన ముసాయిదా జాబితాను అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఈనెల 22 వరకు ఉంది. అందిన అభ్యంతరాలను 23, 24 తేదీల్లో పరిష్కరించి 25వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment