జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): లోక్‌సభ ఎన్నికలు ఈనెల 11న ముగిశాయి. ఇక ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల వంతు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఈనెల 22న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు శనివారం డ్రాఫ్ట్ షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుల స్థానాల పునర్విభజన ప్రక్రియతోపాటు రిజర్వేషన్లను సైతం ఖరారు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీలు 71, ఎంపీటీసీ స్థానాలు 805 ఉన్నాయి. వీటి పదవీ కాలం జూలై 4వ తేదీతో ముగియనుంది.
అంతలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేలా కార్యాచరణకు సంసిద్ధులయ్యారు. ఈనెల 20న పోలింగ్ స్టేషన్లు ఫైనల్ కానున్నాయి. ఈ వెంటనే ఎన్నికల నోటిపికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడతలో 22వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. వచ్చే నెల 6న పోలింగ్ ఉంటుంది. 26న రెండో విడత నోటిఫికేషన్ వెలువడనుండగా మే 10న పోలింగ్ జరుగుతుంది. ఈనెల 30న మూడో విడత నోటిఫికేషన్ జారీ చేయనుండగా మే 14న పోలింగ్ ఉంటుంది. ఈ మూడు విడతల ఫలితాలను 18న ప్రకటించనున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాపంగా 20,96,269 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,50,160 పురుషులు, 10,46,078 మహిళలు, ఇతరులు 31 మంది ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో 805 ఎంపీటీసీ స్థానాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు 805 ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 441 పం చా యతీలకుగాను 184 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డా యి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 పంచాయతీలు ఉంటే 212 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు గాను 128 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 పంచాయతీలకుగాను 141 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నారాయణపేట జిల్లాలో 280 గ్రామపంచాయతీలకుగాను 140 స్థానాలు ఉన్నాయి. జిల్లా పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లాలో 982 స్థానాలు ఉండేవి. ప్రస్తుతం 805 స్థానాలకు తగ్గాయి.
71 జెడ్పీటీసీ స్థానాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 జెడ్పీటీసీలు స్థానాలు ఏర్పాడ్డాయి. గతంలో 64 జెడ్పీటీసీలు ఉండగా జి ల్లాల పునర్విభజన సమయంలోనే 20 కొత్త మం డలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీం తో ప్రతి మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో... ముసాపేట రాజాపూర్, గండీడ్ (రంగారెడ్డి నుంచి పాలమూరు జిల్లాలో క లిసింది); జోగుళాం గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోళి, కేటీదొడ్డి; నాగర్‌కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊరకొండ, చారకొండ, పదర; నారాయణ పేట జిల్లాలో కృష్ణ, మరికల్; రంగారెడ్డి జిల్లాలో క డ్తాల్, నందిగామ, చౌదర్‌గూడ; వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అ మరచింత మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి అధికారులు జెడ్పీటీసీ స్థానాలుగా గుర్తించారు.
3 జిల్లాల్లో రెండు విడతల్లో ఎన్నికలు
మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడుతలో నవాబ్‌పేట, జడ్చర్ల, భూత్పూర్, గండీడ్, మిడ్జిల్, బాల్‌నగర్, రాజాపూర్ మండలాలు ఉన్నాయి. రెండవ విడతలో మహబూబ్‌నగర్, అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ, చిన్నచింతకుంట, ముసాపేట, హన్వాడ మండలాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు మండలాలు ఉన్నాయి. రెండో విడతలో మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, ఊట్కూర్ మండలాలు ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో ధరూరు, కేటీదొడ్డి, గట్టు, మల్దకల్, గద్వాల; రెండో విడతలో అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోళి, అయిజ మండలాలు ఉన్నాయి
రెండు జిల్లాలో మూడు విడతల్లో..
వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి జిల్లాకు సంబంధించి మొదటి విడతలో వనపర్తి, గోపాల్‌పేట, రేవల్లి, ఖిల్లాఘనపూర్; రెండో విడతలో పెద్దమందడి, కొత్తకోట, మాదనపూర్, ఆత్మకూర్, అమరచింత; మూడో విడతలో శ్రీరంగాపూర్, పెబ్బేరు, చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో లింగాల, అమ్రాబాద్, బల్మూర్, పదర, అచ్చంపేట, ఉప్పునుంతల, వంగూరు, చారగొండ; రెండో విడతలో వెల్దండ, కల్వకుర్తి, ఊర్కొండ, తాడూరు, తెల్కపల్లి; మూడో విడతలో తిమ్మాజీపేట, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, కోడేరు, పెంట్లవెల్లి, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాలు ఉన్నాయి.
ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు శిక్షణ
జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో భాగంగా ఈనెల 14న జెడ్పీ హాల్‌లో ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు ఎన్నికల శిక్షణ ఇచ్చారు. అలాగే 15న మండల కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 19న కలెక్టర్, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది.
ఎన్నికలను బాధ్యతాయుతంగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎన్నికల నోడల్‌అధికారి సుచరిత ఆదేశించారు. ఆదివారం స్తానిక జెడ్పీ హాల్‌లో ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు ఎన్నికల శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేదాక అన్ని జాగ్రత్తగా నిర్వహించాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల ఫలితాలను వెల్లడించే వరకు ఆర్‌ఓ, ఏఆర్‌ఓలు కీలంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
జెడ్పీటీసీ నామినేషన్లు ఆయా మండలాల్లో స్వీకరించనున్నట్లు, ఎంపీసీటీ నామినేషన్లు క్లస్టర్లలో స్వీకరించనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ నామినేషన్లు ఆర్‌ఓలు, ఎంపీటీసీ నామినేషన్లను ఏఆర్‌ఓలు స్వీకరించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని, ఏమైనా అనుమానాలు వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ పద్మజా, ఎంపీడీఓలు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధమే
ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఓటర్ జాబితా, రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేశాం. ఈనెల 20న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల చేస్తాం. – వసంతకుమారి, జెడ్పీ సీఈఓ, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment