సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో రెండు రోజుల నుంచి చలిగాలుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం 17.5 కనిష్ట, 29.8 గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అయినా స్వైన్‌ఫ్లూ మాత్రం విజృంభిస్తూనే ఉంది. తాజాగా గాంధీలో 34 మంది, ఉస్మానియాలో ఆరుగురు అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఐపీఎంకు పంపారు. ఇక కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి మరో 60 నమూనాలు పంపారు. అయితే వాటి ఫలితాలు రావాల్సి ఉంది. బాధితుల్లో ఒకరు ఆర్మీజవాను ఉండగా, మరొకరు ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం.
ఫ్లూ నిర్ధారణ పరీక్షల కిట్స్ కరువు
నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఐపీఎం పై ఉన్న భారాన్ని తగ్గించేందుకు శుక్రవారం నుంచి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ స్వైన్‌ఫ్లూ టెస్టులు ప్రారంభించి రెండు రోజులు గడవక ముందే ల్యాబ్‌లో కిట్స్ అయిపోయాయి. దీంతో ఆయా ఆస్పత్రుల నుంచి వచ్చిన శాంపిల్స్ ఇప్పటి వరకు నిర్ధారణ పరీక్షలకు నోచుకోలేదు.
ఆందోళన అవసరం లేదు: వైద్య నిపుణులు
‘ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, ప్రస్తుతం దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ వైరస్ ఉంది. ఒకే సారి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటంతో కిట్స్ కొరత ఏర్పడుతోంది. ఫీవర్ ఆస్పత్రి ల్యాబ్‌లో అవసరానికి తగినన్ని కిట్స్ లేకపోవడంతో వ్యాధి నిర్థారణ పరీక్షల్లో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. త్వరలోనే కిట్స్‌ను తెప్పించి వీలైనంత తర్వగా ఐపీఎం నుంచి ఫీవర్ ఆస్పత్రికి అందిన శాంపిల్స్‌ను పరీక్షించి రిపోర్టులు ఇస్తాం’అని ఓ వైద్య నిపుణుడు స్పష్టం చేశారు.