రాష్ట్రంలో ఓ కీలక నేతకు చెందిన మెడికల్ కాలేజీ, దాని అనుబంధ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు జరుగుతున్నాయి. తనకున్న పలుకుబడితో ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఆర్‌టీ–పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను బెదిరించి తీసుకెళ్తున్నాడు. అలా ఉచితంగా తీసుకెళ్లిన కిట్లతో పరీక్షలు చేస్తూ రూ. 3,500 చొప్పున వసూలు చేస్తున్నాడు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిట్లకు కొరత ఏర్పడింది. ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేయాలంటే ఆసుపత్రి వర్గాలు భయపడుతున్నాయి.
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో రోజుకు కనీసం 50 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తుంటారు. కానీ ఒక్కోసారి 30 పరీక్షలు మాత్రమే చేసి మిగిలిన కిట్లను అక్కడి డాక్టర్ సొంత క్లినిక్‌కు తీసుకెళ్తున్నాడు. టెస్టుల కోసం వచ్చే బాధితులకేమో ఆ రోజు కోటా అయిపోయిందని చెబుతూ రికార్డుల్లో మాత్రం 50 టెస్ట్‌లు చేసినట్లు చూపుతున్నాడు. అలా మిగిలిన 20 కిట్లను తన క్లినిక్‌కు తీసుకెళ్లి ఒక పరీక్షకు రూ. 3 వేల చొప్పున వసూలు చేస్తున్నాడు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విరివిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను కొందరు డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నాయి. సాధారణంగా యాంటిజెన్ కిట్ ధర రూ.500 మాత్రమే ఉంటే, వాటిని తమ సొంత క్లినిక్‌లలో వాడుతూ రూ.3,000–3,500 వసూలు చేస్తూ పరీక్షలు చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి తన బోధనాసుపత్రిలో టెస్టులు చేసేందుకు బలవంతంగా ఒక జిల్లా ఆసుపత్రి నుంచి యాంటిజెన్ సహా ఆర్‌టీ–పీసీఆర్, యాంటి జెన్ కిట్లను తీసుకెళ్తుండటంపై ఆ జిల్లాలో దుమారం నెలకొంది. ఆ జిల్లా ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోవాలంటే పలుకుబడి కలిగిన వారితో పైరవీలు చేయించుకోవాల్సిందేనన్న ఫిర్యాదులున్నాయి.
ఇళ్లకు తీసుకుపోతున్న వీఐపీలు
కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 1,076 ప్రభుత్వాసుపత్రులు, కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, లేబొరేటరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కిట్లను అక్కడి సిబ్బందిని ప్రలోభపెట్టి కాజేస్తున్నాయి. ఇక ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు డాక్టర్లు కూడా వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇక కొందరు వీఐపీలు, నేతల ఇళ్లలోనూ కిట్లు కనిపిస్తున్నాయి. వారు టెక్నీషియన్లను పిలిపించుకొని టెస్టులు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్ పరీక్ష అక్కడికక్కడే చేయడానికి వీలుండటంతో ఇలా ఎవరికివారు యాంటిజెన్ కిట్లను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
దొంగ ఓటీపీలు.. దొంగ రిజిస్ట్రేషన్లు
ఒక యాంటిజెన్ పరీక్ష చేయాలంటే.. పరీక్షకు వచ్చిన బాధితుడి ఫోన్ నంబర్‌ను సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్లో నమోదు చేయాలి. ఆపై ఆ నంబర్‌కు వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దాన్ని మళ్లీ ఎంటర్ చేశాకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అప్పుడు మాత్రమే బాధితుడికి టెస్టు చేయాలి. ఇంత పకడ్బందీ వ్యవస్థను కూడా కొందరు వైద్య సిబ్బంది ధ్వంసం చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఉదాహరణకు ఎలాంటి సెల్‌ఫోన్ లేని సాధారణ వ్యక్తి వచ్చి టెస్ట్ చేయమంటే, అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్త ఫోన్ నంబర్ ఇచ్చే వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితిని కిట్లను కొట్టేసేందుకు కొందరు వైద్య సిబ్బంది తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తద్వారా రికార్డుల్లో అన్ని పరీక్షలు చేసినట్లుగానే ఉంటుంది కానీ కిట్లు మాయమైపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment