- మొదట హతుల పేర్లు తప్పు చెప్పిన నిందితుడు
- విచారణలో అసలు విషయం బయటపెట్టిన వైనం
జీడిమెట్ల, న్యూస్‌లైన్: జంట హత్యల కేసు కొత్త మలుపు తిరిగింది. పట్టుబడ్డ నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించబోయి బోల్తాపడ్డాడు. శనివారం నిందితుడి విచారణ సందర్భంగా అసలు విషయం తెలుసుకున్న పోలీ సులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు... ఉత్తర ప్రదేశ్‌కు చెందిన శంషుద్దీన్(30) నగరానికి వలస వచ్చి ఫతేనగర్‌కు చెందిన యువతిని వివాహం చేసుకుని గాజులరామారం చంద్రగిరినగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు.
మూడు నెలల వ్యవధిలోనే (2007) అదే ప్రాంతానికి చెందిన యూసుఫ్ అనే వ్యక్తిని సుఫారీ హత్య చేశాడు. మృతదేహాన్ని గాజులరామారంలోని బాలాజీ పాఠశాల సమీపంలో పడేశాడు. ఈ హత్య మిస్టరీగా మారింది. అనంతరం తాము ఉంటున్న గది పక్కనే ఉండే వరంగల్ జిల్లా జనగాంకు చెందిన కిరణ్ (28) తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని శంషుద్దీన్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. 2008లో అతడిని చంపేశాడు.
మృతదేహాన్ని ఇంటి సమీపంలోని సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టారు. కిరణ్ అదృశ్యం అప్పట్లో మిస్టరీగా మారింది. అనంతరం శంషుద్దీన్ తన భార్యతో సహా మెదక్‌జిల్లా సదాశివపేటకు వెళ్లిపోయాడు. శంషుద్దీన్‌పై అనుమానం వచ్చిన పోలీసులు అప్పటి నుంచి అతని కోసం గాలిస్తున్నారు. పది రోజుల క్రితం అతను టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అనూహ్యంగా చిక్కాడు.
రెండు హత్యల విషయాన్ని బయటపెట్టిన నిందితుడు మొదట్లో హతుల పేర్లను తప్పుగా చెప్పి పోలీసులను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే, నిందితుడిని శనివారం మరింత లోతుగా విచారించగా హతుల అసలు పేర్లు బయటపెట్టాడు. శనివారం సంఘటనా స్థలాన్ని సీఐ సుదర్శన్, ఎస్సైలు నాగరాజు, భూపాల్‌గౌడ్ సందర్శించారు. సెప్టిక్ ట్యాంక్ నుంచి శుక్రవారం స్వాధీనం చేసుకున్న అస్థికలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ నిపుణుడు లక్ష్మణ్‌కు అప్పగించారు. పోలీసులు రావడంతో స్థానికులు ఏమి జరుగుతుందోనని పెద్ద ఎత్తున గుమిగూడారు. అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు.