నేనూ పేదింట్లోనే పుట్టాను | my backgroung is very poor, says social welfare secretary Praveen kumar | Sakshi
Sakshi News home page

నేనూ పేదింట్లోనే పుట్టాను

Published Wed, Jan 14 2015 9:56 AM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

my backgroung is very poor, says social welfare secretary Praveen kumar

- బాగా చదివా.. ఉన్నత స్థాయికి వచ్చా..
- కూలిపనులు చేస్తూ పిల్లల్ని చదివించడం అభినందనీయం
- సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్
 

పరిగి: ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు పరిగి మండలం నస్కల్‌కు వచ్చారు. ఇంతలో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా స్థానిక ఎస్సీ కాలనీలోకి నడిచారు. గ్రామం చివరలో ఉన్న సీనయ్య, సాయమ్మ దంపతులు ఇంటి తలుపు తట్టారు. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ఓ కుమారుడు.. ఎప్పటిలాగే పిల్లలకు వంట చేసి సద్ది కట్టుకుని కూలిపనులకు పోదామని తయారయ్యారు ఆ దంపతులు.

అదే సమయంలో అనుకోని అతిథి వారింటి ఇంటి గడప దాటి లోపలికి రావడంతో వారు ఆశ్చర్యచకితులయ్యారు.. ఆశ్చర్యంలోంచి తేరుకునేలోపే.. అమ్మా.. పెద్దాయనా.. బాగున్నరానే అంటూ ఆయన ఆప్యాయంగా పలకరించారు.. మీరెవరో గుర్తొస్తలేరు.. ఎవరు నాయనా మీరు.. మేం గుర్తుపట్టలేదు అంటూ వారు అనుమానంగా పలకరించారు. ఇంతలో ఆ గ్రామానికి చెందిన చదువుకున్న యువకుడు వెళ్లి సీనయ్య దంపతుల చెవిలో విషయం చెప్పాడు. ఆయన ప్రవీణ్‌కుమార్ సార్ అని పెద్దసారు.. మన ఇండ్లల్ల ఎంట్ల బతుకుతున్నరు.. పిల్లల్ని మంచిగ చదివిస్తున్నారా లేదా అని తెలుసుకోనీకే వచ్చిండు.. అని చెప్పటంతో వారు అవాక్కయ్యారు. ఏం మాట్లాడాలో.. ఏంచేయాలో వారికి తోచలేదు.. ఇంతలో ప్రవీణ్‌కుమార్ కల్పించుకుని మీరు ఏం పని చేస్తరు.. అని అడిగారు. కూలిపనులు చేస్తం సారు అని సమాధానమిచ్చారు.. రోజుకు ఎంతిస్తరు..? నాకు రెండు నూర్లు.. మా ఆవిడకు నూరు ఇస్తరు.. పొలం ఉందా?.. లేదు సారు..  మీకెంతమంది పిల్లలు..?  ముగ్గురు పిల్లలు బాబూ అని చెప్పారు సీనయ్య దంపతులు. వారు ఏం చదివారు ప్రవీణ్‌కుమార్ అడగడంతో.. పెద్దమ్మాయిని డిగ్రీ చదివించినం.. ఇప్పుడు ప్రైవేటు దవాఖాన్ల నర్సు ఉద్యోగం చేస్తోంది. చిన్నబిడ్డ.. కొడుకు పరిగిల కాలేజ్‌కి పోతున్నరు.. అంటూ ఆ దంపతులు ప్రవీణ్‌కుమార్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. సీనయ్య ఇంట్లో ప్రవీణ్‌కుమార్ గంటసేపు ఉన్నారు. వారితో చాయ్ పెట్టించుకుని తాగారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు.

ఎస్సీ కాలనీల్లో సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. నేనూ.. మీలాగే పేదింట్లో పుట్టాను.. చదువుకోవటంవల్లే ఈ స్థాయికి వచ్చానని వివరించారు. కూలిపనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్న ఆ దంపతులను ఆయన కొనియాడారు. వెలుపల ఉన్న పరిగి సీఐ ప్రసాద్, ఎస్‌ఐలు కృష్ణ, శంషుద్దీన్‌లను ఇంట్లోకి పిలిపించారు. వారు కష్టపడి చదువుకుని పైకి ఎలావచ్చారో చెప్పించారు. అనంతరం అక్కణ్నుంచి వెళ్లిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement