IPS Praveen kumar
-
ఐపీఎస్ అధికారి బయోపిక్.. ఆ రోజే రిలీజ్!
నంద కిషోర్ హీరోగా నటించిన చిత్రం ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో). ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఐరా ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై మామిడాల నీల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న రిలీజ్ కానుంది. శనివారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల ప్రవీణ్ IPS ట్రైలర్ విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. అలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని, ఆదర్శం (ఐడియలిజం) అనేది జన హృదయాలను తాకుతుందన్నారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా అనేక విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారని అన్నారు. పూర్ణ మలావతి, ఆనంద్ లతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహింపజేశారని గుర్తు చేశారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నా తొలి చిత్రం డైరెక్టర్ దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ... ఇది నా తొలి చిత్రం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మూడు పార్టులుగా తీయాలి. కానీ సెలెక్టివ్ అంశాలను తీసుకొని ప్రవీణ్ IPS మూవీ తీశాం. ఆయన నాకు ఇన్స్పిరేషన్. వివేక్ కూచిభోట్ల గారు లేకపోతే నాకు ఈ సినిమా అవకాశం వచ్చేది కాదని చెప్పారు. తనకు అన్ని విషయాల్లో అండగా నిలిచినందుకు వివేక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడ్డారు ASKES ఫౌండేషన్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో కష్టాలను భరించి ఐపీఎస్ అధికారిగా ఎన్నో సేవలు చేశారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ IPS మూవీ హిట్ కావాలని ఆకాంక్షించారు. చదవండి: రెండేళ్లుగా అదే తెలుసుకున్నా.. ఒంటరితనమే బాగుంది! -
నేనూ పేదింట్లోనే పుట్టాను
- బాగా చదివా.. ఉన్నత స్థాయికి వచ్చా.. - కూలిపనులు చేస్తూ పిల్లల్ని చదివించడం అభినందనీయం - సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పరిగి: ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు పరిగి మండలం నస్కల్‌కు వచ్చారు. ఇంతలో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా స్థానిక ఎస్సీ కాలనీలోకి నడిచారు. గ్రామం చివరలో ఉన్న సీనయ్య, సాయమ్మ దంపతులు ఇంటి తలుపు తట్టారు. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ పరిస్థితి ఆ కుటుంబానిది. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ఓ కుమారుడు.. ఎప్పటిలాగే పిల్లలకు వంట చేసి సద్ది కట్టుకుని కూలిపనులకు పోదామని తయారయ్యారు ఆ దంపతులు. అదే సమయంలో అనుకోని అతిథి వారింటి ఇంటి గడప దాటి లోపలికి రావడంతో వారు ఆశ్చర్యచకితులయ్యారు.. ఆశ్చర్యంలోంచి తేరుకునేలోపే.. అమ్మా.. పెద్దాయనా.. బాగున్నరానే అంటూ ఆయన ఆప్యాయంగా పలకరించారు.. మీరెవరో గుర్తొస్తలేరు.. ఎవరు నాయనా మీరు.. మేం గుర్తుపట్టలేదు అంటూ వారు అనుమానంగా పలకరించారు. ఇంతలో ఆ గ్రామానికి చెందిన చదువుకున్న యువకుడు వెళ్లి సీనయ్య దంపతుల చెవిలో విషయం చెప్పాడు. ఆయన ప్రవీణ్‌కుమార్ సార్ అని పెద్దసారు.. మన ఇండ్లల్ల ఎంట్ల బతుకుతున్నరు.. పిల్లల్ని మంచిగ చదివిస్తున్నారా లేదా అని తెలుసుకోనీకే వచ్చిండు.. అని చెప్పటంతో వారు అవాక్కయ్యారు. ఏం మాట్లాడాలో.. ఏంచేయాలో వారికి తోచలేదు.. ఇంతలో ప్రవీణ్‌కుమార్ కల్పించుకుని మీరు ఏం పని చేస్తరు.. అని అడిగారు. కూలిపనులు చేస్తం సారు అని సమాధానమిచ్చారు.. రోజుకు ఎంతిస్తరు..? నాకు రెండు నూర్లు.. మా ఆవిడకు నూరు ఇస్తరు.. పొలం ఉందా?.. లేదు సారు.. మీకెంతమంది పిల్లలు..? ముగ్గురు పిల్లలు బాబూ అని చెప్పారు సీనయ్య దంపతులు. వారు ఏం చదివారు ప్రవీణ్‌కుమార్ అడగడంతో.. పెద్దమ్మాయిని డిగ్రీ చదివించినం.. ఇప్పుడు ప్రైవేటు దవాఖాన్ల నర్సు ఉద్యోగం చేస్తోంది. చిన్నబిడ్డ.. కొడుకు పరిగిల కాలేజ్‌కి పోతున్నరు.. అంటూ ఆ దంపతులు ప్రవీణ్‌కుమార్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. సీనయ్య ఇంట్లో ప్రవీణ్‌కుమార్ గంటసేపు ఉన్నారు. వారితో చాయ్ పెట్టించుకుని తాగారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీల్లో సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. నేనూ.. మీలాగే పేదింట్లో పుట్టాను.. చదువుకోవటంవల్లే ఈ స్థాయికి వచ్చానని వివరించారు. కూలిపనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్న ఆ దంపతులను ఆయన కొనియాడారు. వెలుపల ఉన్న పరిగి సీఐ ప్రసాద్, ఎస్ఐలు కృష్ణ, శంషుద్దీన్లను ఇంట్లోకి పిలిపించారు. వారు కష్టపడి చదువుకుని పైకి ఎలావచ్చారో చెప్పించారు. అనంతరం అక్కణ్నుంచి వెళ్లిపోయారు.