అంతుచిక్కని హత్యలు.. ఆత్మహత్యలు
రియల్ ఎస్టేట్ వ్యాపారం, వివాహేతర సంబంధాలు, ఆస్తి, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ తగాదాలు.. కారణాలు ఏవైతేనేం..! జిల్లాలోని హైదరాబాద్ శివారు మండలాల పరిధిలో లభిస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీటిలో కొన్ని హత్యలు ఉండగా మరికొన్ని ఆత్మహత్యలు న్నాయి. హత్యకు పాల్పడిన వారు ఆనవాళ్లు కూడా దొరక్కుండా పెట్రోల్, యాసిడ్, కిరోసిన్ పోసి మృతదేహాలను కాల్చివేస్తున్నారు. కేసులు నమోదు చేసి శవాల గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సఫలం కావడం లేదని తెలుస్తోంది.
భువనగిరి
హెచ్‌ఎండీఏ పరిధిలోని బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్ మండలాల్లో పలు చోట్ల గుర్తు తెలియ ని వ్యక్తుల మృతదేహాలు లభ్యమవుతుండటం ప్రజల ను భయబ్రాంతులకు గురి చేస్తోంది.రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పారిశ్రామిక వాడల్లో హత్యగావించబడి న వ్యక్తుల మృతదేహాలను ఇక్కడకు తెచ్చి పడేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఆధారాలు దొ రక్కుండా మృతదేహాలను కాల్చేస్తున్నారు. హత్యకు గురవుతున్న వారిలో ఎక్కువగా యువత, మధ్య వయస్సున్న వారే కావడం గమనార్హం. పోలీస్ స్టేషన్లలోనూ ఇటువంటి సంఘటనలకు సంబంధించిన కేసుల సంఖ్య పెరిగిపోతోంది.
పొరుగున ఉండటం వల్లేనా..!
జిల్లాలోని హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న పలు మండలాలు హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్నాయి. దీనికి తోడు సికిం ద్రాబాద్, హైదరాబాద్ నగరాల నుంచి రహదారి, రైల్వే మార్గం ఉండడంతో నిందితులు చాకచక్యంగా తమ పని పూర్తిచేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ మార్గాల్లో ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ పోలీస్ చెక్‌పోస్ట్ లేకపోవడం కూడా నిందితులకు కలిసి వస్తోంది. మృతదేహాలను నిర్జన ప్రాంతాలు, గుట్టల్లో పడవేస్తుండడంతో రోజుల తరబడి గుర్తించడం కష్టతరమవుతోంది.
2014 సంవత్సరంలో...
ఫిబ్రవరి 11న బీబీనగర్ మండలం వెంకిర్యాల సమీపంలో 25-23 ఏళ్ల వయస్సున యువకుడి శవం లభ్యం.
మార్చి 26న పెచ్చికల్‌పహాడ్ శివారులో గుర్తు తెలియని వృద్ధుడి(80) మృతదేహం.
మార్చి 29న బీబీనగర్ మండలం జైనపల్లి శివారులో 30-35 సంవత్సరాల వయస్సున్న యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు.
మే 20న బీబీనగర్ మండలం రాఘవాపురం వద్ద 60-65 సంవత్సరాల వృద్ధుడు మృతి.
జూన్ 9న బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద 40-45 సంవత్సరాల వయస్సున్న మహిళ హత్య.
ఆగస్టు 4న మాసాయికుంటవద్ద 55 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శవం లభించింది.
ఆగస్టు 18న భువనగిరి-బీబీనగర్ పాత రోడ్డు 25-32 ఏళ్ల వయస్సున్న యువకుడి హత్య.
సెప్టెంబర్ 4న గుర్తు తెలియని మహిళ(60) శవం దొరికింది.
2012 సంవత్సరంలో...
జూన్ 30న బట్టుగుడెంలో లభ్యమైన 53 ఏళ్ల వయస్సుగల గుర్తు తెలియని వ్యక్తి శవం.
నవంబర్ 2న బీబీనగర్ వద్ద 60 వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని కనుగొన్నారు.
నవంబర్ 8న మసాయికుంట వద్ద 40 నుంచి 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం లభించింది.
మే 12న పడమటిసోమారం వద్ద 80 ఏళ్ల వయస్సు గల మహిళ, ఇదే నెల 26న గుడూరులో మరో వ్యక్తి మృతి.
2013 సంవత్సరంలో..
ఫిబ్రవరి రాఘవాపురం వద్ద 35-40 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి శవం.
ఫిబ్రవరి 4న రాయిగిరి, హన్మాపురం గ్రామాల మధ్య 60 నుంచి 65 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి మృతదేహం లభ్యం.
మార్చి 3న బీబీన గర్ వద్ద 35 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంను కనుగొన్నారు.
మే 4న రాయిగిరి వద్ద గుర్తు తెలియని వ్యక్తి (55) మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.
జున్ 5న రాయిగిరి సమీపంలో 50 ఏళ్ల వ్యక్తి హత్య.
జూన్ 17న బీబీనగర్‌లో 20-25 మధ్య వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది.
జూన్ 18న 60-65 సంవత్సరాల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి శవం.
ఆగస్టు 24న బీబీనగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో 35-40 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.
అగస్టు 30న కూనూరు వద్ద 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తి గుర్తు తెలియని శవం లభ్యం.
సెప్టెంబర్ 28 న బీబీనగర్‌లో 72 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని శవం.
అక్టోబర్ 26న రాయిగిరి వద్ద 40-45 మధ్య వయస్సున్న గుర్తు తెలియని శవం.
డిసెంబర్ 5న బొమ్మలరామారం మండలం మర్యాలలో 20-30 ఏళ్ల వయస్సున్న యవకుడి హత్య.
డిసెంబర్ 16 వడపర్తి వద్ద 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న గుర్తు తెలియని శవం.
డిసెంబర్ 25న 21 - 25 సంవత్సరాల వయస్సున్న యువకుడి హత్య.
టోల్‌గేట్‌కు అవతలివైపునే..
హత్యగావించిబడిన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు ఎక్కువగా బీబీనగర్ మండలం గూడూరు వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేట్ అవతలే లభ్యమవుతున్నాయి. టోల్‌గేట్ వద్ద గల సీసీ కెమెరాల్లో వాహనాలకు సంబంధించిన సమాచారం నిక్షిప్తం అవుతుండటంతో దుండగులు మృతదేహాలను టోల్‌గేట్ అవతలి వైపునే వదిలి వెళ్తున్నారు. దీంతో హత్యలన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బయటపడ్డ గర్తు తెలియని శవాలు ఎక్కువగా బీబీనగర్ మండలంలో లభించడం గమనార్హం.