
సాక్షి, హైదరాబాద్: గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ విద్య, వైద్యం, ఆరోగ్యం, సురక్షిత తాగునీరు కల్పించేందుకు వ్యవసాయ విద్యార్థులు ముందుకు రావాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. విద్యార్థులకు తరగతి బోధన కన్నా క్షేత్రస్థాయి విజ్ఞానంపై శిక్షణ కల్పించాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. డిగ్రీలు పొందిన విద్యార్థులు సమాజ అభ్యున్నతికి పాటుపడాలని, అలా జరగనప్పుడు వాటికి ఫలితం ఉండదని చెప్పారు. గ్రామాల్లో ప్రజల అభివృద్ధి, వారి జీవన ప్రమాణాల పెంపు కోసం విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని కోరారు.
వ్యవసాయ, ఉద్యాన విభాగాలు కలసి పనిచేయాలి..
వ్యవసాయ, ఉద్యాన విభాగాలు సమన్వయంతో కలసి పనిచేయాలని, వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నారు. దీనిపై సీఎంతో చర్చిస్తానని గవర్నర్ పేర్కొన్నారు. రైతుకు తన భూమే జీవితమని, ఒకసారి పంట విఫలమైతే అతని జీవితం కకావికలం అవుతోందన్నారు. రైతులకు అవసరమైన సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు అందించాలని సూచించారు. గ్రామాల్లో దారిద్య్రరేఖకు దిగువన జీవించే వారి పరిస్థితి మెరుగుపడాలని ఆకాంక్షించారు.
పంటకు సరైన ధర వచ్చే వరకు నిల్వ వసతి కల్పించాలని.. అప్పుడే వ్యాపారులతో చర్చించి రైతు సరైన ధర పొందుతాడని అన్నారు. ప్రయోగశాలలో జరుగుతోన్న పరిశోధన ఫలాలు రైతుల పొలాలకు అందించడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని అభినందించారు. గ్రామీణ భారత జీవనచిత్రాన్ని మార్చాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పేదరికం లేని తెలంగాణ సమాజమే తన కల అని, అందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం తన వంతు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి: ఐకార్ డైరెక్టర్
వ్యవసాయంలో భవిష్యత్ వ్యాపారవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు. ఐదో డీన్స్ సిఫార్సులకు అనుగుణంగా దేశంలో వ్యవసాయ పట్టభద్రులను వారు స్వతహాగా బతకడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పించేవారిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
విద్యార్థులకు రైతుల వద్ద ఆగ్రో పరిశ్రమల్లోనూ నైపుణ్యాలు కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐకార్ పరిశోధన కేంద్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా దేశంలో ఆహారధాన్యాల దిగుబడి గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా నీటి వనరుల సమర్థ వినియోగం జరుగుతోందన్నారు. అనంతరం 2014 నుంచి 2016 వరకు యూనివర్సిటీ ప్రగతి నివేదికను వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు సమర్పించారు.
విద్యార్థులకు పట్టాలు..
కార్యక్రమంలో 319 మంది పీజీ, పీహెచ్‌డీ, 790 మంది డిగ్రీ విద్యార్థులకు గవర్నర్ పట్టాలు ప్రదానం చేశారు. 17 మందికి బంగారు పతకాలు అందిం చారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఎం.శ్రావణి 5, దివ్యశ్రీ 3 బంగారు పతకాలు సాధించారు. అగ్రికల్చర్ ఫ్లాంట్ పాథాలజీకి చెందిన ప్రసాద్ 3 బంగారు పత కాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment