నాటి ఉద్యమానికి ఫలితం.. త్వరలో మరో కొత్త జిల్లా ! | Narayanpet May Will Be The New District | Sakshi
Sakshi News home page

నాటి ఉద్యమానికి ఫలితం.. త్వరలో మరో కొత్త జిల్లా !

Published Sun, Dec 16 2018 11:07 AM | Last Updated on Sun, Dec 16 2018 11:07 AM

Narayanpet May Will Be The New District - Sakshi

నారాయణపేట పట్టణంలోని ప్రధాన రహదారి

నారాయణపేట రూరల్‌ : నాటి ఉద్యమానికి నేడు ఫలితం రాబోతోంది.. రోజుల తరబడి చేసిన దీక్షలు.. రోడ్లపై చేపట్టిన ఆందోళనలకు అప్పట్లో చలించని ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటుచేసిన అప్పటి ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావడంతో ప్రజల ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అడుగులు వేస్తోంది.. ఎన్నికల కోడ్‌ తదితర అడ్డంకులన్నీ తొలిగిపోయాక రెండు, మూడు నెలల్లో నారాయణపేట జిల్లాగా రూపుదాల్చనుంది. అది పూర్తయ్యాక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఐదు జిల్లాలుగా ఏర్పడినట్లవుతుంది. 

2016 ఏప్రిల్‌లో.. 
పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఏప్రిల్‌ 2016లో నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్‌ వంటి నిర్ధిష్టమైనప్రాతిపదికలేవీ లేకుండా లేకుండా ముందుకుపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఉద్యమాలు జరిగాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో గద్వాల, నారాయణపేటను సైతం జిల్లాలు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. అయితే, చివరి నిమిషంలో గద్వాలకు ఆ హోదా దక్కినా.. నారాయణపేటను మాత్రం విస్మరించా రు. చిన్నచిన్న ప్రాంతాలను జిల్లాలుగా చేసి, అన్ని అర్హతలు ఉన్న ‘పేట’ను ఎందుకు చేయడంలేదని ఈ ప్రాంత ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. 

జిల్లా సాధన సమితి ఏర్పాటు 
చారిత్రాత్మకంగా, శాస్త్రీయంగా పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో తొలి మున్సిపాలిటీగానే కాకుండా రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా కొనసాగుతున్న నారాయణపేట జిల్లాగా ఏర్పాటు చేయడానికి అర్హత ఉంది. ఈ మేరకు 2016 మే 19న జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల ఆధ్వర్యంలో నిరహారదీక్షలు, వినూత్న నిరసనలు చేసి జిల్లా ఆకాంక్షను వెల్లడించారు. అయినా ప్రభుత్వం వివిధ కారణాల తో సానుకూలంగా స్పందించలేదు. దాదాపు ఏడాది పాటు చేపట్టిన ఆందోళనల్లో ఇక్కడి ప్రజలు అన్ని రకాల పండుగలను సైతం త్యాగం చేసి రోడ్లపైనే ఉన్నారు.  

సర్దిచెప్పిన అమాత్యులు 
తెలంగాణ ఉద్యమానికి సరిసమానంగా కొనసాగిన ‘పేట’ జిల్లా ఉద్యమంపై స్పందించిన అమాత్యులు ఇచ్చిన హామీతో నాయకులు వెనక్కి తగ్గారు. అప్పట్లో ఉద్యమ తీవ్రతను చూసి అధికార పార్టీలో చేరిన స్థానిక ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సైతం రాజీనామా అస్త్రం ప్రయోగించారు. చివరికి మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్‌రెడ్డి ‘పేట’కు వచ్చి అప్పటి ఎస్‌ఎల్‌డీసీ కళాశాలలో జిల్లా సాధన సమితి నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. జిల్లా ఇవ్వడం కష్టమని.. భవిష్యత్‌లో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేపడితే 32వ జిల్లా హోదా నారాయణపేటకే వస్తుందని సీఎం చెప్పినట్లు వారు పేర్కొన్నారు. అందుకు ప్రతిగా జిల్లా స్థాయికి తగినట్లు ఒక ఐఏఎస్‌ అధికారితో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా ఆస్పత్రి వంటివి ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వారు ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.  

ఎన్నికల హామీగా కొత్త జిల్లా 
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నాయకులు నారాయణపేట అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం జిల్లా ఏర్పాటు అంశాన్ని ముందుకు తెచ్చారు. ప్రచారంలో ప్రతీ అభ్యర్థి ఇదే అంశంపై హామీ ఇస్తుండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆలోచనలో పడింది. ఇక అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి తరపున ప్రచారానికి ఈనెల 25న నారాయణపేటకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రాజేందర్‌రెడ్డిని గెలిపిస్తే నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఓటర్లు రాజేందర్‌రెడ్డిని గెలిపించారు. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో జిల్లాల నుంచి సంఖ్య 33కు పెరగనుందని చెప్పడం ద్వారా నారాయణపేట జిల్లాకు ఏర్పడనుందని స్పష్టత ఇచ్చారు. 

కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి? 
రాష్ట్రంలో మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయంటూ సీఎం కేసీఆర్‌ స్వయంగా వెల్లడించారు. దీంతో నారాయణపేట జిల్లా కానుందని స్థానికుల నుంచి ఆనందం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఎప్పుడు జిల్లా ప్రకటన వచ్చినా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు ముందుగానే భవనాల పరిశీలనలో నిమగ్నమైనట్లు సమాచారం. పట్టణ శివారు సింగారం క్రాస్‌ రోడ్డు పక్కన గల మూతబడిన ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల భవానిన్న కలెక్టరేట్‌ కోసం, పాత కోర్టు(కల్లు డిపో) భవనాన్ని ఎస్పీ కార్యాలయం కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక ఆర్డీఓ గెస్ట్‌ హౌస్‌ను కలెక్టర్‌ బంగ్లాగా, ఆర్‌అండ్‌బీ రెస్ట్‌ హౌస్‌ను ఎస్పీ రెసిడెన్స్‌గా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా మైనార్టీ పాఠశాల భవనం, వెటర్నరీ కార్యాలయ భవనంతో పాటు మరికొన్ని కూడా అందుబాటులో ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారులు భావిస్తున్నారు. 

ఏయే మండలాలు ? 
కొత్తగా ఏర్పాటయ్యే నారాయణపేట జిల్లాలో ఏయే మండలాలు ఉండనున్నాయనే అంశంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మండలాలతో జిల్లాను ఏర్పాటుచేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నారాయణపేట మున్సిపాలిటీతో పాటు దామరగిద్ద, మద్దూర్, దౌల్తాబాద్, ధన్వాడ, మరికల్, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, కోయిలకొండ మండలాలు చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, చివరి వరకు ఇందులో చిన్నచిన్న మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. 

ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుంది 
ఈ ప్రాంత ప్రజలు నారాయణపేటను జిల్లాగా ఏర్పాటుచేయాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు వారి కల నేరవేరబోతుంది. నెలల తరబడి చేసిన ఉద్యమ ఫలితంగా నేడు జిల్లాగా మారనుంది. ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రావడంతో సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధం కావడం ఆనందంగా ఉంది. -డాక్టర్‌ మనోహర్‌ గౌడ్‌, జిల్లా సాధనసమితి కన్వీనర్‌

పాలన చేరువ అవుతుంది 
నారాయణపేట జిల్లా కావడం వల్ల పరిపాలన ప్రజలకు చేరువవుతుంది. వివిధ పనుల నిమిత్తం ఇప్పటి వరకు మహబూబ్‌నగర్‌ వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు జిల్లా కావడంతో విద్యా, వైద్య రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయి. అలాగే, స్థానికంగా జిల్లా స్థాయి అధికారులు అన్ని శాఖల్లో అందుబాటులో ఉంటారు. 
– భార్గవి, యువతి, నారాయణపేట 

‘లోకాయపల్లి’గా నామకరణం చేయాలి 
కేసీఆర్‌ గతంలో ఇచ్చిన జిల్లాలకు సంప్రదాయ బద్ధంగా దేవుడి పేరు తో పేర్లు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటుచేయను న్న రెండు జిల్లాల్లో ములుగును సమ్మక్క – సారలమ్మ జిల్లాగా పేరు పెట్టనున్నట్లు తె లుస్తోంది. నారాయణపేటకు సైతం చారిత్రక ప్రాచు ర్యం కలిగిన లోకాయపల్లి లక్ష్మమ్మ పేరు పెట్టాలి.    
– మణికుమార్, విద్యార్థి, నారాయణపేట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement