నల్లగొండ: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి నిగ్గు తేల్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), యాంటీ టైరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న జానకీపురం గ్రామానికి చెందిన కొందరిని విచారించారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ముంబైకి చెందిన ఏటీఎస్ టీం జానకీపురం వెళ్లింది.
వారి వెంట జిల్లాకు చెందిన ఒక సీఐ, ఎస్‌ఐతో పాటు ఆపరేషన్‌లో పాల్గొన్న కానిస్టేబుల్ కూడా ఉన్నారు. సాయంత్రం సమయంలో ఘటనాస్థలానికి వెళ్లిన ఎన్‌ఐఏ అధికారులు కూడా తమ దర్యాప్తునకు అవసరమైన వివరాలను సేకరించి వెళ్లారు. మరోవైపు ఘటనాస్థలానికి మధ్యప్రదేశ్, కర్ణాటకకు చెందిన పోలీసు అధికారులు కూడా వచ్చి వెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా జైలు నుంచి పరారైన దుండగులు వీరేనన్న సమాచారంతో ఆ రాష్ట్ర అధికారులు వచ్చారు. మరోవైపు కర్ణాటకలో విధ్వంసం సృష్టించటానికి ప్రణాళికలు రూపొందించిన ముఠా సభ్యులు వీరేనన్న కోణంలో ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. వీరికి తోడు మన రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కాగా, దుండగుల మృతదేహాలను ఉంచిన నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రి వద్దకు కూడా ఏటీఎస్ బృందాలు వచ్చి వెళ్లాయి. అత్యంత గోప్యంగా అధికారులు ఆసుపత్రిలోనికి వెళ్లి తమకు అవసరమైన సమాచారం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ శాంతిభద్రతల అదనపు డీజీ సుధీర్‌లాక్టాకియా, ఐజీ నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకరరావులు కూడా దుండగుల మృతదేహాలను పరిశీలించి వెళ్లినట్టు తెలుస్తోంది.
విస్తృత కూంబింగ్..
కాగా, అసలు ఈ దుండగులు ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఆక్టోపస్ పోలీసులతో కలిసి దాదాపు 150 మంది వరకు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా నిందితులు తలదాచుకున్నారని భావిస్తున్న అర్వపల్లి గుట్టల్లో పెద్ద ఎత్తున గాలింపులు జరిపారు. కాగా, ఆదివారం ఉదయం సమయంలో మరోసారి జిల్లాలో వదంతులు వ్యాపించాయి. తుంగతుర్తి మండలంలోని కుక్కడం గ్రామంలో మరో దుండగుడు స్థానికులకు తారసపడ్డాడని పుకార్లు రావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, పోలీసులు నాగారం, అర్వపల్లి గుట్టల్లో కూంబింగ్ నిర్వహించిన తర్వాత అలాంటిదేమీ లేదని పోలీసులు నిర్ధారించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.