లోటు తగ్గింది.. రాబడి పెరిగింది
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
సంగారెడ్డి క్రైం: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సంపర్క్ అభియాన్’ పేరిట వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమం లో దత్తాత్రేయ పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్ల నేడు ఆర్థిక పరిస్థితి లోటు నుంచి పరిపుష్టికి చేరుకుందని చెప్పారు. ఇదివరకు లోటు బడ్జెట్ ఉండేదని బీజేపీ అధికారంలోకి వచ్చాక రాబడి పెరిగిందన్నారు.
రూ. 500 కోట్లతో ఓడీఎఫ్ విస్తరణ
సంగారెడ్డి మండలం ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్ కర్మాగారాన్ని రూ.500 కోట్లతో విస్తరిస్తున్నట్టు దత్తాత్రేయ ప్రకటించారు. పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ కల్పించడానికి కేంద్ర రక్షణ శాఖమంత్రితో మాట్లాడతానని చెప్పారు. బీడీ కార్మికులకు ఇళ్ల నిర్మాణానికి రూ.45 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.