సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల గుర్తింపు విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులుగా గుర్తించింది. వీటిని అధికారికంగా నోటిఫై చేసి, గెజిట్‌లో చేర్చాల్సిన కేంద్రం మాత్రం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.17,000 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులకు శంకుస్థాపన, 7 ప్రాజెక్టులకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. విభజన హామీల ప్రకారం తమకు రావాల్సిన జాతీయ రహదారులనే అడుగుతున్నామని కొత్త డిమాండ్లేవీ లేవని రాష్ట్ర ఎంపీలు అంటున్నారు. కనీసం ఉన్న జాతీయ రహదారుల విస్తరణ కూడా చేపట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగం ఖర్చు భరిస్తామంటున్నా..
విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ అభివృద్ధికి జాతీయ రహదారుల అభివృద్ధి అత్యవసరం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 3,155 కి.మీ. పొడవైన 25 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో ఇప్పటికే 1,388 కి.మీ.ల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. మిగిలిన 1,767 కి.మీల మేర రోడ్ల గుర్తింపును ఖరారు చేయకుండా తాత్సారం చేస్తోంది. ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ, ఇతర ఖర్చుల్లో సగం వరకు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రం మీనమేషాలు లెక్కించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి?
రాష్ట్రంలోని 13 రహదారులకు కేంద్రం గతంలోనే జాతీయ రహదారుల హోదా ఇచ్చింది. వీటిని ఇంతవరకూ అధికారికంగా గెజిట్‌లో చేర్చలేదు. దీంతో ఇవి పేరుకు మాత్రమే జాతీయ రహదారులుగా మిగిలాయి. మొత్తం 1,767 కి.మీ.ల దూరం ఉన్న ఈ రహదారులకు అధికారిక గుర్తింపులో మోక్షం కలగకపోవడం గమనార్హం.
హోదా దక్కినా గుర్తింపు రానివి ఇవే!
1. మెదక్–రుద్రూర్–బాసర–భైంసా (ఎన్‌హెచ్ 61, 166 కి.మీ.), 2.కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి (ఎన్‌హెచ్ 563, 165 కి.మీ.), 3.సరపాక–ఏటూరునాగారం–కాళేశ్వరం–చెన్నూరు–కౌతాల– సిర్పూర్ (306 కి.మీ.) 4.మిర్యాలగూడ–పిడుగురాళ్ల –నర్సంపేట (26 కి.మీ) 5.భద్రాచలం–మీలుగుజిల్లి–జంగారెడ్డిగూడెం–దేవురపల్లి (68 కి.మీ) 6. జహీరాబాద్–బీదర్–దేగీర్ (25 కి.మీ) 7. చౌటుప్పల్– ఇబ్రహీంపట్నం–ఆమనగల్–షాద్‌నగర్–చేవెళ్ల–శం కర్‌పల్లి–కంది (ఎన్‌హెచ్–65, 183 కి. మీ.) 8. మెద క్–సిద్దిపేట–ఎల్కతుర్తి (ఎన్‌హెచ్– 65, 133 కి.మీ) 9.హైదరాబాద్ ఓఆర్‌ఆర్ వలిగొండ–తొర్రూర్–నెల్లికుదురు–మహబూబాబాద్–ఇల్లందు–కొత్తగూడెం (ఎన్‌హెచ్ 30, 234 కి.మీ.), 10. తాండూరు–కొడంగల్–మహబూబ్‌నగర్ రోడ్ (96 కి.మీ.), 11 కొత్త కోట–గూడూరు–మంత్రాలయం (ఎన్‌హెచ్–167, 70 కి.మీ.), 12. రంగశాయిపేట– చింత నెక్కొండ–కేసముద్రం–మహబూబాబాద్ (71 కి.మీ.) 13.బహదూర్‌పల్లి–అశ్వాన్‌పల్లి–గోరియావీడు–నేరేడుపల్లి తండా–గర్మిలపల్లి–బుర్రాపల్లి–ఎంపేడ్–వావిలాల– జమ్మికుంట–వీణవంక– కరీం నగర్ (131 కి.మీ.). కాగా, రాష్ట్రంలోని పలు రోడ్ల విస్తరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. కనీసం వీటి విస్తరణకైనా అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్రం ఇంకా పట్టించుకోవట్లేదు.
పార్లమెంటులో నిలదీస్తాం: వినోద్
రహదారులకు కిలోమీటరుకు రూ.4 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన 1,767 కి.మీ.లకు రూ.7,068 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. వీటికి అధికారిక గుర్తింపు, నిర్మాణానికి కావాల్సిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియట్లేదు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిశాం. తాజాగా మరోసారి లేఖ రాశాం. స్పందించకుంటే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం.
హోదా సరే.. గుర్తింపు ఎప్పుడు?
Published Thu, Jan 24 2019 1:00 AM | Last Updated on Thu, Jan 24 2019 1:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment