సాక్షి, కోరుట్ల(కరీంనగర్): ఉన్నోల్లందరు అధికార పార్టీలకు పోయిరి. అక్కడ గీళ్లకు టికెట్ ఇస్తరో లేదోగాని.. గిరగిర తిరగవట్టిరి. మనకేమో ఒకరు ఇద్దరు కాకపాయే.. ముప్పై మూడు మంది కావాలే. పోటీ చేసే వాడకట్టులో రిజర్వేషన్లకు తగ్గట్టు ఎంతో కొంత పేరున్నోడు.. కొన్ని పైసలున్నోడు కావాల్నాయో.. ఏ మూల ఎక్కడ వెతికినా పార్టీలో ఉన్నోళ్లు కనబడుతలేరు.. మా అంటే నాలుగైదు వార్డుల్లో క్యాండేట్లు రడీ ఉన్నరు.. విుగిలిన చోట్ల మంచోళ్లను వెతకాల్సిందే.. ఇదీ కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో ఓ రెండు జాతీయ పార్టీల కీలక నేతలు లోలోన పడుతున్న అంతర్మథనానికి అక్షరరూపం. పోయిన సారి మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్లలోని ఓ జాతీయ పార్టీకి 13 మంది కౌన్సిలర్లు, మరో జాతీయ పార్టీకి ఇద్దరు కౌన్సిలర్లు గెలిసిండ్రు. ఆ తరువాత ఏమైందో.. తెల్వదు కానీ.. ఓ జాతీయ పార్టీ నుంచి ఒకరు తప్ప మిగిలిన వాళ్లంతా మెల్ల మెల్లగా లోకల్ పార్టీకి జంప్‌కాగా.. మరో జాతీయ పార్టీ నుంచి ఓ కౌన్సిలర్ లోకల్ పార్టీకి మారిపోయిండు. గిట్ల జాతీయ పార్టీల్లో ఒక్కొక్కరే మిగిలిండ్రు.
గిప్పుడు మళ్లీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినయ్. పార్టీ పేరు పెద్దగుండే.. అన్ని వార్డుల్లోకెళ్లి క్యాండెట్లను నిలబెట్టాల్నాయే.. పాత క్యాండెట్లు లోకల్ పార్టీల ఉండిరి. అక్కడ టిక్కెట్ల కోసం తిరగవట్టిరి. మళ్లీ ఎలచ్చన్ల గెలిచేటి ముప్పైమూడు మంది కొత్త క్యాండేట్లను దొరకబుచ్చుకోవాలే. ఇగో..గీ పరేషాన్‌లో జాతీయ పార్టీ లీడర్లు కిందమీద అవుతుండగా.. లోకల్ పార్టోళ్లు మాత్రం టిక్కెట్ల పోటీ పెరిగిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నరు. పాతోళ్లు.. కొత్తోళ్లు మాకు టిక్కెట్ అంటే..మాకు టిక్కెట్ అనుకుంట పోటీ పడి లొల్లి పెడుతుండ్రు. ఒక్క వార్డులో ఇద్దరు ముగ్గురికి టిక్కెట్లు ఇయ్యరాదాయే..గీ లొల్లితో రెబెల్స్ తయారై అసలు క్యాండేట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనని లోకల్ పార్టోళ్లు పరేషాన్ పడుతున్నరు.
Comments
Please login to add a commentAdd a comment