ప్రకృతి పండుగ బతుకమ్మ
కరీంనగర్ కల్చరల్ :
బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని పూజించే పండుగని, ఇలాంటి పండుగ ప్రపంచంలో ఎక్కడా లేదని రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లాకేంద్రంలోని సర్కస్‌గ్రౌండ్‌లో బతుకమ్మ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. బతుకమ్మ లేనిదే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. బతుకు గొప్పతనాన్ని ఆవిష్కరించిన బతుకమ్మ.. తెలంగాణ పల్లెల ఆరాధ్యదైవమని వివరించారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. మన భాష, యాస, పండుగ సంస్కృతి గొప్పదని పేర్కొన్నారు.
మన ఆత్మ గౌరవం బతుకమ్మ
- జెడ్పీ చెర్‌పర్సన్ తుల ఉమ
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం బతుకమ్మ అని జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. తెలంగాణ భాష, సంస్కృతిని అందరూ గుర్తించాలని సూచించారు.
బతుకమ్మను పూజించాలి
- రవీందర్ సింగ్, కరీంనగర్ నగర మేయర్
మహిళలు తొమ్మిదిరోజుల పాటు బతుకమ్మను పూజించాలని, అప్పుడే మన బతుకులు బాగుపడుతాయని కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. వేడుకల్లో కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు జేసీ నంబయ్య, నగర కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, అధికారులు విజయలక్ష్మీ, సంగీతలక్ష్మీ, సత్యవాణీ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న
పేరిణి నృత్యం
బతుకమ్మ ఉత్సవాల ప్రాంగణంలో దేవాదాయ, ధర్మదాయ శాఖ ఏర్పాటు చేసిన దుర్గామాత ఆలయాన్ని మంత్రి , జెడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ సందర్శించారు. రతన్ కుమార్ బృందం ప్రదర్శించిన పేరిణి నృత్యం ఆకట్టుకుంది.