వర్గల్(గజ్వేల్) : జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష(జేఏన్‌వీఎస్‌టీ–2018) ఫలితాల వెల్లడిలో అంతులేని జాప్యం కొనసాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఫలితాల జాడ లేదు. ఈక్రమంలో ఫలితాల కోసం వేచి చూడాలా? లేక ప్రైవేటు స్కూళ్లలో చేర్పించాలా? అనే సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఫలితాలపై ఆరా తీసే వారికి నవోదయ వర్గాలు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా(మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట) వ్యాప్తంగా ఆరో తరగతిలో కేవలం 80 సీట్లకు గాను సగటున ఒక్కో సీటుకు 100 మంది చొప్పున పోటీపడుతూ మొత్తం 8,456 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో 6,623 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ లెక్కలే తల్లిదండ్రుల్లో నవోదయపై ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తుంది. ఎంట్రన్స్ నిర్వహణకు సంబంధించి సీబీఎస్‌ఈతో నవోదయ విద్యాలయ సమితి టైఅప్ అయ్యింది. దీని ప్రకారం ప్రవేశ పరీక్షను నవోదయ విద్యాలయ సమితి అధికారులు నిర్వహించగా, సీబీఎస్‌ఈ అధికారులు ప్రశ్నపత్రాలను వాల్యూయేషన్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. అక్కడి నుంచే మెరిట్, రిజర్వేషన్‌ప్రకారం ప్రవేశార్హత సాధించిన 80 మంది విద్యార్ధుల పేర్లతో కూడిన జాబితా విడుదల అవుతుంది. దీని ఆధారంగా ఆయా జిల్లాలలోని నవోదయ విద్యాలయాలు ఫలితాలు రిలీజ్ చేస్తాయి.
ఆలస్యంగా ఎంట్రన్స్ పరీక్ష
సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాల్లో ఏటా ఫిబ్రవరి 10న ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా 2018 విద్యా సంవత్సరం కోసం వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశం పొందేందుకు ఫిబ్రవరి 10న ఎంట్రస్ పరీక్ష జరుగుతుందని ప్రాస్పెక్టస్‌లో స్పష్టం చేశారు. ఏప్రిల్ లేదా మే మొదటి వారంలో ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ సరళీకరణ కోసం మాన్యువల్ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్‌లైన్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే, నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా అధికారులు ఎంట్రన్స్ నిర్వహించలేదు.
నూతన విధానంలో దరఖాస్తుల సమర్పణ, సాంకేతిక సమస్యలు తలెత్తడం, కొత్త విధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ ప్రణాళిక రూపొందించుకోకపోవడం తదితర కారణాలు ఎంట్రన్స్ పరీక్ష వాయిదాకు దారి తీశాయి. సాంకేతిక కారణాలు గా చూపుతూ ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన పరీక్షను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్టు నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది. దా దాపు రెండున్నర నెలలు ఆలస్యంగా ఏప్రిల్ 21న ఎంపిక పరీక్ష నిర్వహించారు. దీంతో రిజల్ట్ వెల్లడిలో అంతులేని తాత్సారం కొనసాగుతోంది. జూ న్ ముగిసినా ఎంట్రన్స్ ఫలితాలు రాకపోవడంతో సీబీఎస్‌ఈ వైఫల్యంపై విమర్శలువస్తున్నా యి.
అంతా అయోమయం
ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి కాకపోవడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. నవోదయ పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తే ఫీజుల భారం తగ్గుతుందని, నాణ్యమైన విద్యతో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని భావించిన వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నా ఫలితాలు జాడలేకపోవడంతో ఆర్థిక స్తోమత కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు మాత్రం ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు.
గిట్లయితే నవోదయ పేరు చెడిపోతది
మేము పేదోళ్లం. నవోదయల సదువుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతదని నమ్మకం. ఐదో తరగతి చదువుతుండగానే మా కొడుకుతోని నవోదయ పరీక్ష రాయించిన. సీటొస్తే ఫీజుల బాధ పోతది. బాగ చదువొస్తదనుకున్న. నమ్మకంగా సీటొస్తదనుకుంటే బడులు మొదలై నెలరోజులు దాటినా రిజల్ట్ వస్తలేదు. గిట్లయితే నవోదయ పేరు ఖరాబైతది. నమ్ముకం పోతది. బిరాన రిజల్ట్ పెడితే అయోమయం పోతది.
– అశోక్, నెంటూరు
ఫలితాల్లో జాప్యం వాస్తవమే..
నవోదయ ఎంట్ర¯Œస్ట్ టెస్ట్ ఫలితాల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. సీబీఎస్‌ఈ ఫలితాల జాబితా పంపిన వెంటనే విడుదల చేస్తాం. ఆన్‌లైన్ నేపథ్యంలో ఫిబ్రవరి 10న జరగాల్సిన పరీక్ష ఏప్రిల్ 21కి వాయిదా పడింది. రిజల్ట్స్ కోసం తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్‌లు వస్తున్నాయి. జూలై మొదటి వారంలోగా రిజల్ట్స్ వస్తాయనుకుంటున్నాం. ఫలితాలు వెల్లడి కాగానే వెంటనే పత్రికల ద్వారా విడుదల చేస్తాం. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు.
– వెంకటరమణ, ప్రిన్సిపాల్, వర్గల్ నవోదయ
Comments
Please login to add a commentAdd a comment