
‘అన్ని పార్టీల సమ్మతితోనే జీఎస్టీ అమలు’
► కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నడూ ఏక పక్ష నిర్ణయం తీసుకోలేదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విషయంలో అన్ని రాష్ట్రాలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి కూలంకశంగా చర్చించిన తర్వాతే అమలు చేశామని చెప్పారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పుడు ఏకపక్ష నిర్ణయం అని పేర్కొనడం సరికాదన్నారు. ఆదర్శ్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అన్ని పక్షాల మద్దతుతోనే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై 12శాతం జీఎస్టీ ఉందని, దాన్ని తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో చర్చిస్తానన్నారు. రైతాంగానికి ఉపయోగపడే అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్నారు. దీనిపై కేసీఆర్ న్యాయ పోరాటం చేస్తాననడం సమంజసం కాదన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పలు ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలకడం శుభపరిణామం అన్నారు. ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ కూడా మద్దతు ఇచ్చిందన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ఎన్నికవడం అభినందనీయమని, ఆ పదవికి ఆయన పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారన్నారు.