సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై అధిష్టానం జయనామ సంవత్సరం తొలిరోజున కొలిక్కొచ్చింది. గెలుపు గుర్రాల జాబితాను వడపోసిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తిచేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి జాబితాకు తుది మెరుగులు దిద్దింది. పార్లమెంటు స్థానాల విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ, శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రం ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో స్వల్ప మార్పులు మినహా మెజార్టీ శాసనసభ్యులకు టికెట్లు దక్కినట్లు సమాచారం.
ఉప్పల్ శాసనసభ్యుడు బండారి రాజిరెడ్డి స్థానే సోదరుడు లక్ష్మారెడ్డిని బరిలోకి దించేందుకు అధిష్టానం అంగీకరించింది. మరోవైపు ప్రముఖ సినీ నిర్మాత ఆది శేషగిరిరావును కూకట్‌పల్లి నుంచి బరిలో దించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణేతరులు, సినీ పరిశ్రమకు సంబంధించిన ఓటర్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నందున ఈయన అభ్యర్థిత్వాన్ని ఓకే చేసింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ నందికంటి శ్రీధర్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈయనకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ పట్టుబడుతున్నారు. ఇదిలావుండగా, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సర్వే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌కు టికెట్ ఇవ్వకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మేడ్చల్‌పై జైపాల్ పట్టు
తన అనుచరుడు ఉద్దెమర్రి నరసింహారెడ్డికి మేడ్చల్ టికెట్ ఇప్పించడానికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. అధిష్టానం పెద్దలతో నేరుగా సంప్రదింపు లు జరుపుతున్న ఆయన ఉద్దెమర్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేలా లాబీ యింగ్ చేస్తున్నారు. ఈ పరిణామం సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని ఇరకాటంలో పడేస్తోంది. సిట్టింగ్‌లకు స్థాన మార్పిడి ఉండదనే ధీమాతో ఉన్న ఆయనకు జైపాల్ వ్యవహారశైలి మింగుడు పడడంలేదు.
ఎంపీ రేసులో శశిధర్
మరోవైపు చేవెళ్ల లోక్‌సభ స్థానానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి మహబూబ్‌నగర్ నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్న జైపాల్‌రెడ్డి తన స్థానంలో శశిధర్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు వ్యూహారచన చేస్తున్నారు. ఒకవేళ శశిధర్ కనుక పోటీకి విముఖత చూపితే మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధిష్టానానికి సూచించారు. తద్వారా తన అనుయాయుడు ఉద్దెమర్రికి లైన్‌క్లియర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, కేఎల్లార్ మాత్రం సిట్టింగ్ స్థానాన్ని వదిలేందుకు ససేమిరా అంటున్నారు.
రాజేంద్రనగర్‌కు సబిత
కుటుంబసభ్యులకు ఒక సీటే అనే హైకమాండ్ నిబంధన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీని ఆత్మరక్షణలో పడేసింది. చేవెళ్ల ఎంపీ బరిలో సబితను దింపాలని అధిష్టానం భావించినా.. ఆమె మాత్రం రాజేంద్రనగర్ నుంచి తిరిగి అసెంబ్లీకి పోటీచేయాలని యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్ చెవిన వేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన అగ్ర నాయకత్వం మహేశ్వరం నుంచి రాజేంద్రనగర్‌కు మారేందుకు అంగీకరించారు. అయితే, కుటుంబంలో ఒకరికే సీటు నిబంధన సబిత ఫ్యామిలీని ఇరకాటంలో పడేసింది. తనయుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా, తాను రాజేంద్రనగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే, అధిష్టానం షరతు ఆమెకు ప్రతికూలంగా మారింది. దీనికితోడు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వ్యతిరేకంగా పావులు కదుపుతుండడం సబిత వర్గీయులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆమె అవకాశాలను దెబ్బతీయాలనే ఆలోచనతో శశిధర్ పేరును తెరమీదకు తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
‘చేతి’లో జాబితా!
Published Mon, Mar 31 2014 10:57 PM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM
Advertisement
Advertisement