నెక్లెస్ రోడ్డు మోడల్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ కోమటి చెరువుపై ప్రత్యేకంగా నెక్లెస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సిద్దిపేటలో నిర్మించనున్న ఈ రోడ్డు నిర్మాణంపై ప్రముఖ అర్కిటెక్ట్ సంవాద్ ప్రధాన్ రూపొందించిన విజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఆయన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా అదికారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో నిర్మించనున్న నెక్లెస్ రోడ్డు ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం కలిగేలా విజన్‌కు అనుగుణంగా నిర్మాణం ఉండాలని, తన డ్రీమ్ ప్రాజెక్టుపై రూపకల్పన చేసి, సిద్దిపేట నెక్లెస్ రోడ్డు అంటే రోల్ మోడల్‌గా నిలిచేలా ఉండాలని అధికారిక వర్గాలను ఆదేశించారు.
కలెక్టర్‌తో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
నిర్మాణం వచ్చే సంవత్సరం మార్చి నెలలోపు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజెంటేషన్‌లో చిన్నా, పెద్దలకు సరదాగా గడిపేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని, అక్కడక్కడా ఎత్తు వంపులతో మంచి అనుభూతి కలిగించేలా ఉండాలన్నారు. నెక్లెస్ రోడ్డు సుందరీకరణలో భాగంగా ఏ,బీ,సీ,డీ,ఈ జోన్లుగా విభజించనున్నామన్నారు. చెరువు కట్ట కిలోమీటర్ ఉండగా, నిర్మించే నెక్లెస్ రోడ్డు ఒకటిన్నర కిలోమీటర్ ఉండనుందన్నారు. అదేవిదంగా పాత, కొత్త కట్టలను కలుపుతూ రెండున్నర కిలోమీటర్లు రింగు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ప్రాజెక్టును రూ.25 కోట్లతో నిర్మించనున్నట్లు, మొదటగా సీ, డీ జోన్ల పనులు యుద్ధప్రాతిపాదికన ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ లక్ష్మణ్, మున్సిపల్ ఇంజనీర్లు మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment