
అమ్రాబాద్ (అచ్చంపేట): నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువారం రోడ్డెక్కారు. తమ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ గురువారం హాస్టల్ నుంచి మన్ననూరులోని ఐటీడీఏ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. జంగంరెడ్డిపల్లి నుంచి మొల్కమామిడి వరకు 8 కిలోమీటర్లు విద్యార్థినులు వెళ్లాక.. సమాచారం అందుకున్న పీవో వెంకటయ్య వారికి ఎదురొచ్చారు.
విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి తమకు గణితం, బయోసైన్స్, ఫిజిక్స్, సోషల్, తెలుగు బోధించే టీచర్లు లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా హాస్టల్‌లో అనేక సమస్యలు ఉన్నాయని విన్నవించారు. దీంతో స్పందించిన పీఓ మాట్లాడుతూ శుక్రవారమే ఇద్దరు ఉపాధ్యాయులను పంపించడంతో పాటు వారంలోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment