వివరాలను వెల్లడిస్తున్న సీఐ మడత రమేశ్
పాల్వంచ: కొడుకు ప్రేమ వివాహం చేసుకుని తీసుకొచ్చిన కోడలికి, అత్తకు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వారికి కూతురు పుట్టడంతో వారసుడు పుట్టలేదంటు సూటిపోటీ మాటలతో తిడుతుండటంతో తట్టుకోలేక క్షణికావేశంలో రోకలిబండతో అత్త తల పగులగొట్టి హత్య చేసింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేశ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన స్థానిక ఇందిరాకాలనీలో మైల కనకతార (53) కోడలు చైతన్య చేతిలో హత్యకు గురైంది. కనకతార భర్త సింగరేణి ఉద్యోగి. కొన్ని సంవత్సరాల కిందటే చనిపోయాడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ముగ్గురి వివాహాలు జరిగాయి. కనకతార తన చిన్న కొడుకు నాగరాజు కుటుంబంతో కలిసి ఉంటోంది. నాగరాజు గతంలో చైతన్యను ప్రేమ వివాహాం చేసుకుని తీసుకొచ్చాడు. వారికి ఒక కూతురు కూడా ఉంది. నాగరాజు కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా ఇక్కడి ఇంట్లో కనకతార, చైతన్య కలిసి ఉంటున్నారు. అయితే అత్త తన కొడుకుని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకున్నావు? ఆడపిల్లను కన్నావు? అంటూ వేధిస్తుండటంతో వారి మధ్య తరచూ మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గత ఆదివారం మధ్యాహ్నం గొడవ జరగడంతో కోడలు చైతన్య అత్త కనకతారను రోకలి బండతో తలపై కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో పోలీసులు కోడలిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె హత్య చేసినట్లు తేలిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ ముత్యం రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మానవ సంబంధాలను మెరుగు పర్చుకోవాలి తప్ప, వాటిని పాడుచేసుకోవద్దని, క్షణికావేశంతో హంతకులుగా మారొద్దని తెలిపారు. చిన్న చిన్న తాగాదాలు ప్రతి కుటుంబాల్లో సహజమని, ఇతరుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్‌కు వస్తే కౌన్సెలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment