తెలంగాణలో కొత్త రూట్లో ప్రజా రవాణా! | New Approaches To Public Transport System In Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్త రూట్లో ప్రజా రవాణా!

Published Fri, May 8 2020 12:49 AM | Last Updated on Fri, May 8 2020 4:02 AM

New Approaches To Public Transport System In Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ రూటు మార్చుకోనుంది. సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో భౌతికదూరం తప్పనిసరి కానున్న నేపథ్యంలో రద్దీ నివారణకు ఏం చర్యలు చేపడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం, జారీ చేసే మార్గదర్శకాల మేరకు ప్రజా రవాణా వ్యవస్థను నడపాల్సి ఉంటుంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ కారణంగా మెట్రో రైలు రూ.100 కోట్లు, ఆర్టీసీ రూ.120 కోట్ల మేర నష్టాలను మూటగట్టుకున్నాయి. కరోనా నేపథ్యంలో తీసుకోనున్న జాగ్రత్తల ఫలితంగా ఈ రెండు రవాణా వ్యవస్థలు కొత్త ఫార్మాట్‌లో ప్రయాణించనున్నాయి.

సగం మందితోనే మెట్రో జర్నీ..
లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి మెట్రో రాకపోకలు ఆగిపోయాయి. దాదాపు 60 రైళ్లు డిపోలకే పరిమితమైనా.. వీటి నిర్వహణ వ్యయం, సిబ్బంది జీతభత్యాలు తడిసిమోపెడవుతున్నాయని మెట్రో వర్గాలు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికులు నిలుచునేందుకు వైట్‌ మార్కింగ్‌ సర్కిల్స్‌ ఏర్పాటు చేయాలని మెట్రో నిపుణులు అంటున్నారు. ఒక్కో రైలు ప్రయాణికుల సామర్థ్యం (3 బోగీలు కలిపి) 900. ఇంతమందిని ఇప్పుడు అనుమతించే పరిస్థితి ఉండదు. వీరిలో సగం మందినే అనుమతించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకునే వరకు ఈ భౌతికదూరం తప్పదంటున్నారు. స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయడం, మాస్కులుంటేనే అనుమతించాల్సి ఉంటుంది. చదవండి: సంక్షోభంలోనూ పెట్టుబడులకు చాన్స్‌ 

సిటీబస్సులో నో స్టాండింగ్‌..
కరోనా నేపథ్యంలో ఆర్టీసీ కూడా ప్రణాళికలను రూపొం దిస్తోంది. గ్రేటర్‌ నగరంలోని బస్సులకు రెండువైపులా డోర్లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనివల్ల సీట్ల సామర్థ్యం మేరకే ప్రయాణికులకు రవాణా సదుపాయం అందుతుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్టాండింగ్‌ జర్నీకి అనుమతించరాదని నిర్ణయించారు. బస్సులు డిపోల్లో పూర్తిగా శానిటైజ్‌ అయ్యాకే రోడ్డెక్కుతాయి. ప్రయాణికుల మధ్య కచ్చితమైన భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌ చేస్తారు. ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరిని, ఇద్దరు కూర్చొనే సీట్లలో ఒక్కరినే అనుమతిస్తారు. ఏసీ, నాన్‌ ఏసీ లోఫ్లోర్‌ బస్సుల్లో ఆటోమేటిక్‌ డోర్లు ఏర్పాటు చేస్తారు. కరోనా జాగ్రత్తల దృష్ట్యా రూట్ల సంఖ్య తగ్గనుంది. మెట్రో రైలు అందుబాటులో లేని ప్రధాన రూట్లలోనే ఇవి నడుస్తాయి. ఇక బస్సుల్లో టికెట్లు ఇచ్చే పద్ధతికి ప్రత్యామ్నాయంగా గ్రౌండ్‌ టికెటింగ్‌ విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ఏ మేరకు సాధ్యమనేది కూడా చర్చనీయాంశమైంది.  చదవండి: భయం.. భయంగానే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement