దెబ్బ తగలని పార్క్‌ | New Children's Play Area Will inaugurates Mayor Bonthu Rammohan | Sakshi
Sakshi News home page

దెబ్బ తగలని పార్క్‌

Published Fri, Nov 8 2019 3:54 AM | Last Updated on Fri, Nov 8 2019 7:53 AM

New Children's Play Area Will inaugurates Mayor Bonthu Rammohan - Sakshi

గచ్చిబౌలి: చిన్నారులు చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోతూ ఆడిపాడుతుంటే తల్లిదండ్రులందరికీ ఆనందమే.. అయితే కొంచెం భయం కూడా! ఎక్కడ పట్టుతప్పి పడిపోతారో.. దెబ్బలు తగిలించుకుంటారోనని.. చిల్డ్రన్స్‌ ప్లే ఏరియాకు వెళ్తే అటువంటి భయం అవసరం లేదు. పిల్లలను స్వేచ్ఛగా, సీతాకోకచిలుకల్లా వదిలేయొచ్చు. నిశ్చింతగా కూర్చుని వారి ఆటలను, ఆనందాన్ని చూస్తూ ఎంజాయ్‌ చేయొచ్చు.

ఏమిటీ ప్లే ఏరియా? ఎక్కడుంది? 
జారుడుబండ, ఊయల.. సాధారణంగా పిల్లల పార్కుల్లో ఆటల పరికరాలంటే ఇవే. కానీ, గచ్చిబౌలి డాగ్‌ పార్కు ఆవరణలో ఏర్పాటైన చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా కాస్త డిఫరెంట్‌. ఇక్కడ ఆనందాన్నిచ్చే ఆట వస్తువులే కాదు, అటు వ్యాయామాన్ని, ఇటు నైపుణ్యాన్ని పెంచే యాక్టివిటీస్‌ ఎన్నో.. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, చిన్నారుల భద్రత కోసం ఆట వస్తువుల చుట్టూ అడుగు భాగంలో ఒక రకమైన సింథటిక్‌ రబ్బర్‌గా పిలిచే ఈపీడీఎం (ఇథలీన్‌ ప్రొపలీన్‌ డయనీ మానిమర్‌)ను అమర్చారు. కాబట్టి పిల్లలు ఆడుకుంటూ పడిపోయినా గాయపడరు. రూ.40 లక్షల వ్యయంతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ పిల్లల ప్లే ఏరియాను రెండు కేటగిరీలుగా విభజించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు చిన్న ఆట వస్తువులు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి పెద్ద ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. దేశంలోనే ఇటువంటి పిల్లల పార్కు ఇదే మొదటిదని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. దీనిని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించనున్నారు.

ఓపెన్‌ జిమ్‌.. సోలార్‌ లైటింగ్‌ 
►ఈ ప్లే ఏరియాలో చిన్నా, పెద్దా గుట్టలు, స్టెప్పింగ్‌ స్టోన్స్, మల్టీప్లే ఎక్విప్‌మెంట్లు ఎన్నో ఉన్నాయి. ఆపిల్, క్యాప్సికమ్, కీరా, టమాటా వంటి పండ్లు, కూరగాయలు, పురుగులు వంటి బొమ్మలు ఆకట్టుకుంటాయి. 
►పార్కులో రాత్రి వేళ లైటింగ్‌ కోసం సోలార్‌ ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. పార్క్‌లో నాలుగు వైపులా ఉన్న లైట్లు.. విద్యుత్‌ లేకున్నా 6 గంటల పాటు బ్యాకప్‌తో వెలుగులు విరజిమ్ముతాయి. పిల్లల ఆనందానికి అంతరాయం కలగదు. 
►ఈ పిల్లల పార్కు డాగ్‌ పార్కులో భాగంగా ఉంది. డాగ్‌ పార్కుకు పెట్స్‌ను తీసుకొచ్చే పెద్దల కాలక్షేపానికి మూడుచోట్ల ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న వారు ఇక్కడ అప్పర్‌ బాడీ, కార్డియో, సైక్లింగ్, స్టెప్పర్‌ వంటి కసరత్తులు చేయొచ్చు. 
►సెల్ఫీ ఫొటో ఫ్రేమ్‌ ప్రత్యేకాకర్షణ. దీనివద్ద పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సెల్ఫీ దిగొచ్చు.  
►ఇక్కడున్న బ్లాక్‌ బోర్డుపై పిల్లలు తాము పార్క్‌ను విజిట్‌ చేసినట్టు సంతకం చేస్తూ.. పొందిన అనుభూతి గురించి రాయవచ్చు.

దేశంలోనే మొదటిది..
ఈపీడీఎంతో ఈ పిల్లల పార్కును తీర్చిదిద్దాం. ఇక్కడ చిన్నారులు చక్కగా ఆడుకోవచ్చు. ఆడుకుంటూ కిందపడినా దెబ్బలు తగలవు. దేశంలోనే ఇటువంటి పార్కు మరెక్కడా లేదు. పెద్దల కోసం ఓపెన్‌ జిమ్‌ కూడా ఉంది.
– హరిచందన దాసరి, జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌

ఆటలతో పాటే వ్యాయామం, నైపుణ్యం 
హిల్‌ మౌండ్‌: ఇదో చిన్న గుట్ట. దీనిపైకెక్కి.. కిందికి జారవచ్చు. గుట్టలు ఎక్కిన అనుభూతి కలుగుతుంది. పిల్లల్లో క్లైంబింగ్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. 
పిరమిడ్‌: త్రిభుజాకారంలో ఉండే దీని పైకెక్కి, వెనుక వైపు ఉన్న మెట్ల ద్వారా కిందికి దిగవచ్చు. 
మంకీ బార్స్‌: కోతులు చాలా బ్యాలెన్స్‌డ్‌గా చెట్లపై వేలాడుతుంటాయి. పిల్లల్లోనూ ఈ నైపుణ్యం పెంచేందుకు మంకీ బార్స్‌ ఏర్పాటు చేశారు. వీటిపై నిలబడి ఊగడం ద్వారా పిల్లలు పట్టు నిలుపుకునే శక్తిని అలవర్చుకుంటారు. 
టన్నెల్‌: ప్లాస్టిక్‌ గడ్డితో పచ్చగా తీర్చిదిద్దిన సిమెంట్‌ పైపు ఇది. చిన్నారులు పైపు లోపల నుంచి నడుచుకుంటూ బయటకు రావచ్చు. చిన్న ర్యాంపుపై నుంచి ఈ సిమెంట్‌ టన్నెల్‌ను ఎక్కేందుకూ ప్రయత్నించవచ్చు. 
ట్రాంపోలిన్‌: చిన్నారులు ఎగరడాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. ప్లే ఏరియాలో రెండు ట్రాంపోలిన్లు ఉన్నాయి. వీటిపై నిల్చుని అప్‌ అండ్‌ డౌన్స్‌ ఎగరొచ్చు. ఈ ప్రక్రియ పిల్లల మోకాళ్లను బలంగా చేస్తుంది. 
స్నేక్‌ మౌండ్‌: ఇది ఎత్తుగా ఉండే పాము బొమ్మ. బ్యాలెన్స్‌ చేసుకుంటూ దీనిపై చిన్నారులు నడవాల్సి ఉంటుంది. ఇదో మంచి వ్యాయామం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement