ఇంజనీరింగ్‌ విద్యకు కొత్తరూపు | New Education System Will Introduce In Engineering | Sakshi
Sakshi News home page

రీ ఇంజనీరింగ్‌!

Published Mon, Feb 24 2020 2:45 AM | Last Updated on Mon, Feb 24 2020 2:49 AM

New Education System Will Introduce In Engineering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోనూ ఇంజనీరింగ్‌ విద్య స్వరూపం పూర్తిగా మారబోతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా రూపొందించిన మోడల్‌ కరిక్యులమ్‌ అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది ఐదారు కాలేజీలకే పరిమితమైన, సంస్కరణలతో కూడిన రీ ఇంజనీరింగ్‌ విద్య 2020–21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అమల్లోకి రాబోతోంది. పరిశోధన, ఆవిష్కర ణలకు ప్రాధాన్య మిస్తూ, ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉన్న కోర్సులను, అందు కనుగుణంగా మార్పు చేసిన విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జేఎన్‌టీ యూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు తమ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ విద్యలో సం స్కరణలను 2020– 21 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేనున్నాయి. ఇప్పటివరకు కొనసాగుతున్న సంప్రదాయ ఇంజనీరింగ్‌ కోర్సులే కాకుండా మార్కెట్‌ అవసరాలకనుగుణంగా భవిష్యత్‌లో డిమాండున్న కోర్సులు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అమల్లోకి రానున్నాయి.

సామర్థ్య పెంపే లక్ష్యంగా..
విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపు, పరిశోధన, ఆవిష్కరణల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్‌ విద్యలో సంస్కరణలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మోడల్‌కరిక్యులమ్‌ను తెచ్చింది. పారిశ్రామిక రంగానికి చెందిన 8 మంది ఎక్స్‌పర్ట్స్, 33 ఐఐటీ ఎక్స్‌పర్ట్స్‌లతో కూడిన 11 కమిటీలు బీటెక్‌ మోడల్‌ కరిక్యులమ్‌ను రూపొందించాయి. బీటెక్‌లో క్రెడిట్స్‌ను కూడా 200 నుంచి 160కి తగ్గించాయి. ఇక పారిశ్రామిక రంగానికి చెందిన 12 మంది ఎక్స్‌పర్ట్స్, జాతీయ విద్యా సంస్థలకు చెందిన 22 మంది నిపుణులతో కూడిన కమిటీ ఎంటెక్‌లోనూ మోడల్‌ కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోనూ క్రెడిట్స్‌ను 68కి తగ్గించింది.

పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ తెచ్చిన ఈ సంస్కరణలను రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా, పారిశ్రామిక రంగాలకు చెందిన అనుభవజ్ఞులతో కూడిన విద్యా బోధన, విద్యార్థుల్లో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విధానాన్ని ప్రోత్సహించడం, ఇష్టమైన సబ్జెక్టులను చదువుకునేలా సరళీకరణ విధానం విద్యార్థులకు అందుబాటులోకి రాబోతోంది. అంతేకాదు పరీక్ష సంస్కరణలు రాబోతున్నాయి. విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షించేలా 18 శాతం, అవగాహన స్థాయిని పరీక్షించేలా 30 శాతం, విద్యార్థులు తాము తెలుసుకున్న విషయాన్ని అప్‌లై చేసే సామర్థ్యాన్ని పరీక్షించేలా 46 శాతం మార్కుల విధానం అమల్లోకి రానుంది.

ప్రోత్సహిస్తున్న ఉన్నత విద్యామండలి
విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడే ఈ సంస్కరణల అమలును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెన్నంటి ప్రోత్సహిస్తోంది. అందుకు అనుగుణంగా యూనివర్సిటీలకు, అధ్యాపకులకు చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. కొత్త సంస్కరణలు, కొత్త కోర్సులకు సంబంధించిన అనుభవజ్ఞులను, పారిశ్రామిక రంగాల వారిని తీసుకురావడం, ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలను తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే సిద్ధం చేసిన కార్యాచరణను అమల్లోకి తేబోతున్నారు. మరోవైపు విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్థులు ఇండక్షన్‌ ప్రోగ్రాం, తప్పనిసరిగా వేసవిలో ఇంటర్న్‌షిప్‌ విధానం అమలుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కోర్‌ సబ్జెక్టులతోపాటు భారత రాజ్యాంగం, ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్, ఎసెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రెడిషనల్‌ నాలెడ్జ్‌ వంటి అంశాలను విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టాయి.

కచ్చితంగా 3 వారాల ఇండక్షన్‌ ప్రోగ్రాం..
ఇంజనీరింగ్‌లో చేరే ప్రతి విద్యార్థికి కచ్చితంగా మూడు వారాల ఇండక్షన్‌ ప్రోగ్రాం అమలు చేసేందుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో విద్యార్థులకు ఫిజికల్‌ యాక్టివిటీతోపాటు క్రియేటివ్‌ ఆర్ట్స్, యూనివర్సిల్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్, లిటరసీ, ఫ్రొఫిషియెన్సీ మాడ్యూల్స్, ప్రముఖులతో ఉపన్యాసాలు, స్థానిక ప్రదేశాలు సందర్శన, తాము చేరిన బ్రాంచీలకు సంబంధించిన విశేషాలు సమగ్రంగా వివరించడం వంటి చర్యలు చేపడతారు. తద్వారా ఆ విద్యార్థి ఆ కోర్సుకు సంబంధించిన అవగాహనతో ముందునుంచే చదువుకునేందుకు వీలు ఏర్పడనుంది. ఇందులో విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యం, బోధనలో అవసరమైన చర్యలు చేపడతారు.

1,000 గంటల ఇంటర్న్‌షిప్‌..
నాలుగేళ్ల బీటెక్‌ కోర్సు విద్యార్థులకు 1,000 గంటల ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంను ఏఐసీటీఈ అందుబాటులోకి తెచ్చింది. ప్రతి విద్యార్థి దీనిని తప్పసరిగా చేసేలా నిబంధన విధించింది. అందులో విద్యా పారిశ్రామిక సంబంధ ఇంటర్న్‌షిప్‌ను 600–700 గంటల చేయాల్సి ఉంటుంది. అలాగే 300–400 గంటలు సామాజిక సేవా సంబంధ అంశాల్లో ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యా సంస్థలు తమ బడ్జెట్‌లో 1 శాతం కచ్చితంగా కేటాయించాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.

డిమాండున్న కోర్సులకు ప్రాధాన్యం..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్‌ ఉన్న కోర్సులను ఏఐసీటీఈ గతేడాది అందుబాటులోకి తెచ్చింది. అయితే రాష్ట్రంలోని ఐదారు విద్యా సంస్థలు మినహా మిగతావేవీ వీటిని అమలు చేయలేదు. రానున్న విద్యా సంవత్సరంలో మాత్రం వీటిని కచ్చితంగా అమలుచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా యూనివర్సిటీలు తమ పరిధిలోకి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, మెటలార్జికల్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌ వంటి ప్రధాన కోర్సులున్నాయి. వాటిల్లోనే 90 శాతం మంది విద్యార్థులు చేరుతున్నారు. అయితే వాటిల్లోనూ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంజనీరింగ్‌ కోర్సుల స్వరూపం మారుతోంది. అందుకు అనుగుణంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, రోబొటిక్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డిజైన్, ఏఆర్‌ అండ్‌ వీఆర్, త్రీడీ ప్రింటింగ్‌ వంటి కోర్సులను ఏఐసీటీఈ అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు ఆ కోర్సులు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అమల్లోకి రాబోతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement