తలెత్తుకునేలా .. అభివృద్ధి సాధిద్దాం
స్వరాష్ట్రంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు
- జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుదాం
- ఉద్యమానికి ఊతమిచ్చింది మెతుకుసీమే
- కేసీఆర్ సీఎం కావటం జిల్లా ప్రజల అదృష్టం
- సంక్షేమం, అభివృద్ధే నూతన ప్రభుత్వ లక్ష్యం
- ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ స్మితా సబర్వాల్
- పోలీసు పరేడ్ గ్రౌండ్‌సలో జాతీయజెండా ఎగురవేత
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: అరవై ఏళ్ల కల ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, స్వరాష్ట్రంలో ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా జిల్లాను అభివృద్ధిపథంలో నడిపిద్దామని కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టర్ మొదట సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహం ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు.
ఆ తర్వాత పోలీసు పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుని జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీ బాజ్‌పేయ్ తదితర అధికారలతో కలిసి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ తెలంగాణ తల్లి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పోలీసు పరేడ్ గ్రౌండ్స్ వేదికపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి విత్తనాలు నాటి, నాయకత్వాన్ని అందించింది జిల్లా ప్రజలేనని అన్నారు. జిల్లా ముద్దుబిడ్డ కె. చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ పునర్నిర్మాణం జరగనుండటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం కావని, అంచెలంచెలుగా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణను, జిల్లాను అభివృద్ధిలో ముందుంచాలని ప్రజలు, అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం అంకితభావంతో కృషి చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే నూతన ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కలెక్టర్ స్మితా సబర్వాల్ జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబాల సభ్యులను పరామర్శించి వారిని సత్కరించారు. జిల్లాలోని అమరులైన 42 మంది కుటుంబాల సభ్యులను కలెక్టర్ స్మితాసబర్వాల్ సన్మానించారు. ఆవిర్భావ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీబాజ్‌పాయ్, న్యాయమూర్తి రాధారాణి, ఏజేసీ మూర్తి, డీఆర్‌ఓ దయానంద్, డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, ఆర్‌వీఎం పీడీ యాస్మిన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.