నేను కూడా ఒకప్పుడు బీడీ కార్మికురాలిగా పని చేసిన. వారి ఇబ్బందులేమిటో నాకు తెలుసు. ఈ రోజు కూడా వారి బాధలు విన్న. వారి సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. వారి సంపాదన కూడా తక్కువగా ఉంది. అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నయి. బీడీ కార్మికుల దవాఖానాలలో అన్ని రకాల వైద్య సేవలు అందితే బాగుంటుంది. వారి వేతనం కూడా పెరగాలి. కార్ఖానాలలో సమస్యలున్నయి. వాటి మీద దృష్టి సారిస్తా.
బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది తొందరలోనే నెరవేరుతుంది. దీంతో వారికి కొంత మేరకు మేలు జరుగుతుంది. మున్సిపల్ పరిధిలో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా అందజేస్తా.
మేయర్ : చాలా రోజుల తరువాత కార్ఖానాకు వచ్చాను. బాగున్నారా?
లక్ష్మి: సుజాతమ్మా... నువ్వయితే మేయరువు అయినవు. మాకు మాత్రం బీడీలు చుట్టడం తప్పడం లేదు.
మేయర్ : రోజుకు ఎన్ని బీడీలు చుడుతున్నవు?
శోభ : ఎనిమిది నూర్ల బీడీలు చేస్తున్న...పొద్దంత కూసుంటే ఇన్ని బీడీలు అయితున్నయి.
మేయర్ : బీడీలు తక్కువ చేసినట్లా... ఎక్కువ చేసినట్లా?
గోదావరి : తక్కువగానే చేస్తున్నం. సరిపోయేంత తంబాకు ఇవ్వడం లేదు. దీంతో బీడీలు తక్కువగా వస్తున్నయి.
మేయర్: ఎందుకు అలా తక్కువగా ఇస్తున్నరు?
గోదావరి : ఏమో, ఎన్నిసార్లు అడిగినా తంబాకు తక్కువగానే ఇస్తున్నరు. ఎక్కువ ఇవ్వమంటే లేదు అంటున్నరు.
మేయర్ : రోజుకు ఎన్నిగంటలు బీడీలు చుడుతున్నరు?
విజయ : ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పగలు 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీడీలు చుడుతున్నం.
లావణ్య : నేనైతే అర్సపల్లి నుంచి కోటగల్లికి వచ్చి బీడీలు చేస్తున్న... పొద్దుపోయేంత వరకు ఇక్కడే ఉంటున్న.
మేయర్ : ఎందుకు అలా అంత దూరం నుండి వస్తవు?
లావణ్య : నాకు బీడీల కార్డు కోటగల్లిలోని కార్ఖానాలలోనే ఉంది. ఇక్కడే చేయాల్నట.
మేయర్ : అంత దూరం నుంచి వచ్చినందుకు సరిపోయేంత డబ్బులు వస్తున్నయా?
లావణ్య : నెలకు రూ. 1000 నుంచి రూ. 1500 రూపాయలు వస్తయి. వీటితోనే సరిపెట్టుకోవాలి. పిల్లల చదువులు, నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాలు వీటితోనే తీర్చుకోవాలి.
మేయర్ : నేను కూడా గతంలో బీడీలు చేసిన. సమస్యలు నాకు కూడా తెలుసు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా.
వనజ : నేను చాల ఏండ్ల నుంచి బీడీలు చుడుతున్న. పాణం బాగలేదు. ఆపరేషన్ అయింది. అయినా బీడీలు చేస్తున్నా. ఖాళీగా కూసుంటే పైసలు ఎట్ల వస్తయి! ఇల్లు ఎట్ల గడుస్తది. అందుకే బీడీలు చుట్టడం తప్పదు మరి.
మేయర్ : దీనికి బదులు ఏదైన సులువైన పని చేసుకోవచ్చు కదా?
వనజ : నాకు వచ్చిన పని ఒక్కటే బీడీలు చుట్టడం.
మేయర్ : ఆరోగ్య సమస్యలు ఎక్కువుంటున్నయా ?
శారద : ఏం చెప్పమంటవమ్మ. పొద్దుగాల నుంచి పొద్దీకి దాకా గంటల తరబడి బీడీలు చుడుతాం. నడుమునొప్పులు. కాళ్లు, కీళ్ల నొప్పులు అనేకం. ముసలోళ్లు అయితే చాలా ఇబ్బందులుంటయి. వారికి కూసోరాదు. లేవరాదు.
సావిత్రి : నేను 35 ఏళ్ల నుంచి బీడీలు సుడుతున్న. ఏం లాభం. ఆడికాడికి అయితాంది. సంపాదించింది ఏం లేదు. మీదికెళ్లి ఆరోగ్య సమస్యలు బాగా వస్తయి. మా బతుకులు చాల దారుణం.
మేయర్ : మీ కోసం దవాఖానాలు ఉన్నయి కదా?
సావిత్రి : మా దవాఖానాలలో మంచిగనే చూస్తున్నరు. పెద్ద పెద్ద రోగాలు వస్తే బయటకు పంపిస్తున్నరు. మాకు చేతిలో డబ్బులు ఉండవు. బయట తెలియదు. ఎవర్నన్న బతిమిలాడి, వారిని సోపతి చేసుకొని వేరే దవాఖానల చూయించుకోవాల్సి వస్తోంది.
పోచవ్వ : మాకు దవఖాన దూరంగా ఉంది. నడిచిపోవడానికి ఇబ్బందిగా ఉంది. ఆటోల పోతే 40 నుంచి 50 రూపాయలు కావాలె. దూరం ఉండడంతో కొందరు దవఖానాకు వెళ్లలేక పోతున్నరు. వచ్చిన జ్వరం తగ్గిపోతుందిలే అనుకుంట బీడీలు చేసుకుంటున్నారు.
లక్ష్మి : నాకు సొంత ఇల్లు లేదు
మేయర్ : ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వా? అధికారులు ఏమంటున్నారు?
లక్ష్మి : చాన ఏండ్ల నుంచి దరఖాస్తులు ఇస్తు న్న. ఇల్లు మాత్రం అస్త లేదు.
రాధ : నాకు ఎవరూ లేరు. ఒక్కదాన్నే ఉంటున్న?
మేయర్ : అట్ల ఎందుకమ్మ మరి?
రాధ : బీడీలు చేసి బతుకుతున్న. ఇల్లు లేదు. కిరాయికి ఉంటున్న. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న రావడం లేదు.
అమ్ము : నాకు పింఛన్ లేదు. 12 ఏండ్ల వయ స్సు నుంచి బీడీలు సుడుతున్న. ఇంత వరకు పింఛన్ ఇయ్యలేదు. సార్లు వయసు తక్కువున్నదని అంటాండ్రు.
మేయర్ : పీఎఫ్ కమిషనర్‌ను కలిసినవా?
అమ్ము : ఆ సార్ ఎక్కడుంటడో నాకు తెలువ దు. ఎట్ల మరి!
శారద : ఈమెకు 60 ఏండ్లకు బదులు 20 ఏండ్లున్నయని కార్డులో రాసిండ్రు. అందుకే ఈమెకు పింఛన్ అస్తలేదు.
స్వర్ణ : బీడీల కార్డులు సకాలంలో ఇవ్వడం లే దు. మేము ఎన్ని బీడీలు చేస్తున్నమో, ఎన్ని డబ్బులు ఇస్తున్నారో లెక్క కూడా సక్కగ చెప్తలేరు.
మేయర్ : మీ దాదాకు ఈ విషయం చెప్పిం డ్రా మరి?
స్వర్ణ : చాల సార్లు చెప్పినం.
మేయర్ : ఎందుకు మీ సమస్య పరిష్కరించ డం లేదో మరోసారి గట్టిగా అడగండి. దాదా ఇక్కడే ఉంటే మీ తరపున నేను కూడా గట్టిగా అడిగేదాన్ని.
లక్ష్మి : బీడీల కార్డులో నా పేరు లక్ష్మమ్మ అని ఉంది. ఆధార్, ఇతర కార్డులల్ల లక్ష్మి అని ఉం ది. బీడీల కార్డులో ఉన్న పేరే వాడాలని, లేదంటే ఏమి రావంటున్నారు.
మేయర్ : మీ దగ్గరలోని మండల కార్యాల యానికి వెళ్లి చెబితే ఈ సమస్య పరిష్కారమవుతది.
విజయ : ఓట్ల కోసం అందరు వస్తున్నరు. మీకు మేము ఉన్నమంటున్నారు. ఓట్లు అయిపోయినంక మా దగ్గరకు వచ్చేటోళ్లే లేరు.
గంగామణి : పింఛన్లు ఇస్తమని చెబుతున్నరు. ఎప్పుడిస్తరో చెప్తలేరు. మీన్న తెలుసా మరి?
మేయర్ : పింఛన్లు ఇస్తున్నారు. మీ గల్లీలో మీ కార్పొరేటర్లను అడుగుండ్రి.
లావణ్య : బీడీ కార్మికులకు వెయ్యిరూపాయ లు ఇస్తమన్నరు. ఇంటిలో బీడీలు చేసే అందరికి ఇస్తారా. ఒక్కరికే ఇస్తరా?
మేయర్ : బీడీ కార్మికులకు రూ. వెయ్యిరూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిం ది. ఎప్పుడు ఇస్తారన్నది త్వరలో తెలుస్తుంది.
సరస్వతి : బీడీలు చేయడంతో బీమార్ అవుతున్నాం. వచ్చిన డబ్బులతో నూనె, పప్పులు రావడం లేదు. మాకు జీతాలు పెరుగవా?
మేయర్ : మీ సమస్యలను మీ అధికారులకు తెలియజేయాలి. వేతనాలు పెంచేవరకు వారి తో సంప్రదిస్తూ ఉండాలి...మీరు అందరు ఒక్కటిగా ఉండి అడుగాలె.
బతుకు పోరు
Published Sun, Nov 9 2014 3:02 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement